Thursday, September 15, 2016

పంచ మహా యజ్ఞాలు

పంచ మహా యజ్ఞాలు అంటే శాస్త్ర ప్రకారం ప్రతి వ్యక్తీ అనునిత్యం పాటించ వలసిన విధులు. అవి -


1. దేవ యజ్ఞం: పూర్వం నిత్యాగ్నిహోత్రులు వుండేవారు. వారు తాము భోజనం చేసే ముందు కొంచెం అన్నాన్ని అగ్నికి ఆహుతి చేసేవారు. దీనికి ఆహుతం అని పేరు. అలాకాక ఇంట్లో వారందరూ అగ్నికి సమిధలు సమర్పించినా ఆహుతం చేసినట్లే. సృష్టికి మూల కారకుడైన దేవదేవుని నిత్యం తలుచుకుని ఆయనకు కృతజ్ఞతలు తెలపటమే దీని ముఖ్యోద్దేశ్యం.


2. పితృ యజ్ఞం: మనల్ని కని పెంచి ఇంతవారిని చేసిన తల్లితండ్రలను ప్రేమగా చూడాలి. చిన్నప్పుడు వారు మనల్ని ఎంత ప్రేమగా చూశారో, మన అవసరాలెలా తీర్చారో, అలాగే వారి పెద్ద వయసులో వారిని కనిపెట్టుకుని వుండాలి. ఇలా వారి ఋణాన్ని కొంతయినా తీర్చుకోగలం. ఇది పితృ యజ్ఞం.


3. భూత యజ్ఞం: గృహస్తు సర్వప్రాణికోటి మీద దయ కలిగి వుండాలి. పశు పక్షులు,క్రిమికీటకాదులు మానవుడి మీద ఆధారపడి వున్నాయి. అందుకే మనిషికి భూతదయ వుండాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నం పక్షుల కోసం బయట (పక్షులు వచ్చే ప్రదేశంలోపెట్టాలి. ఇంటి ముందు కుక్కకి, ఇంట్లో పిల్లికి అన్నం పెట్టాలి. ఇంట్లో పశువులు వుంటే వాటికి పెట్టాలి. క్రిమి కీటకాల కోసం కొంచెం అన్నం (తినక ముందు) పక్కన పెట్టాలి. (మన పెద్దలు వీటిని పాటించటం మీలో కొందరయినా చూసే వుంటారు). జలాశయాలలో జలచరాలకు కూడా ఆహారం వెయ్యాలి. సర్వ ప్రాణులయందూ దయ కలిగి వుండి ప్రతి నిత్యం కనీసం ఏదో ఒక దానికన్నా ఆహారం ఇవ్వాలి.


4. మనుష్య యజ్ఞం: మన పెద్దలు అతిథి దేవోభవ అన్నారు. అప్పటివారు ఆతిథ్యం కోరి వచ్చినవారు

తమకు తెలియనివారయినా వారిని ఆదరించి సత్కరించేవారు. రోజులు మారినాయి. అయినా ఇంటికొచ్చినవారిని మన కులంవారా, మన మతం వారా మనకే విషయంలోనైనా పనికి వస్తారా లేదా వగైరాలాలోచించకుండా వారు వచ్చిన సమయాన్నిబట్టి తగు విధంగా గౌరవించాలి. తోటివారి పట్ల దయ కలిగి వుండాలి. అందరితో సఖ్యంగా వుండాలి. ఎవరైనా సహాయం కోరితే, మనం చెయ్యగలిగితే నిస్వార్థంగా చెయ్యాలి.

5. బ్రహ్మ యజ్ఞం: ప్రతివారూ, ప్రతి రోజూ వేద మంత్రాలు కానీ శాస్త్రాలని కానీ చదవాలి. ఇప్పుడు వేద మంత్రాలు చదివే వారి సంఖ్య తక్కువగానీ ప్రతి వారూ ఎవరికి వీలయిన, ఎవరికి ఆసక్తి వున్న, ఎవరికి అనుకూలంగా వున్న శాస్త్రాలను చదవాలి. ప్రతి రోజూ కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి చూపించాలి. అంతేకాదు. తను తెలుసుకున్నది ఇతరులకు చెప్పాలి.

ప్రతి మనిషికీ భగవంతుని పట్ల విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భూత దయ, తోటి మనిషులతో కలిసి వుండే మనస్తత్వం, శాస్త్రం తెలుసుకుని నలుగురితో

పంచుకునే జిజ్ఞాస వున్నాయనుకోండి. 


ఈ ప్రపంచం ఎలా వుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. మనిషిని సక్రమ మార్గంలో నడపటానికే ఈ పంచ యజ్ఞాలను నిర్దేశించారు మన పెద్దలు.

సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః


No comments:

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...