(కాయల సాయి నవీన, ప్రత్యేక ప్రతినిధి, మాయావిన్యూస్)
జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశం దాదాపు 10 గంటలకు పైగా కొనసాగి దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక నిర్ణయానికి దారితీసింది. కేంద్రం మరియు రాష్ట్రాలు తీవ్ర చర్చల అనంతరం జీఎస్టీ 2.0 రూపంలో రెండు స్లాబ్ పన్ను నిర్మాణంపై అంగీకరించాయి. ఇప్పటివరకు ఐదు శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం వంటి పలు రేట్లు అమల్లో ఉండగా, ఇకపై సులభతరం చేస్తూ కేవలం రెండు స్లాబ్‌లలోనే పన్ను వసూలు చేయనున్నారు. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి.
ప్రజలకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేశారు. ఇప్పటి వరకు హెల్త్ పాలసీ ప్రీమియంపై సుమారు 18 శాతం వరకు అదనపు జీఎస్టీ బారం పడుతుండగా, ఇకపై అలాంటి భారం ఉండదు. ఉదాహరణకు, ఒక కుటుంబం సాలీనా రూ.20,000 ప్రీమియం చెల్లిస్తే, అదనంగా రూ.3,600 బారం మునుపటి విధానంలో ఉండేది. ఇప్పుడు అది అంతా తొలగి, ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుంది. ఇది ఆరోగ్య భద్రతను మరింత చేరువ చేయనున్న నిర్ణయంగా భావిస్తున్నారు.
సాధారణ వస్తువులను తక్కువ స్లాబ్‌లో వర్గీకరించగా, విలాసవంతమైన వస్తువులు లేదా అధిక ఆదాయం ఇచ్చే సేవలను ఎక్కువ స్లాబ్‌లో చేర్చనున్నారు. ఈ మార్పు వల్ల వ్యాపారులకు పన్ను లావాదేవీలు సులభతరం కాగా, వినియోగదారులకూ ధరల్లో స్పష్టత ఉంటుంది. ఉదాహరణకు, రోజువారీ అవసరాల సరుకులపై తగ్గింపు ఉంటే గృహ ఖర్చులు కొంత తగ్గుతాయి. మరోవైపు కారు, లగ్జరీ ఉత్పత్తులతో వంటి వస్తువులపై అధిక స్లాబ్ వర్తించి ప్రభుత్వ ఆదాయానికి తోడ్పడుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న చారిత్రక సంస్కరణగా అభివర్ణించారు. జీఎస్టీ 2.0 ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా పన్ను విధానాన్ని పారదర్శకంగా మార్చబోతుందని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య పాలసీలపై పన్ను మినహాయింపు సామాజిక సంక్షేమం కోసం తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయం అని చెప్పారు.
మొత్తం మీద ఈ కొత్త విధానం సాధారణ ప్రజలకు పన్నుల సరళీకరణ, ఖర్చుల తగ్గింపు, ఆరోగ్య భద్రత హామీ వంటి లాభాలను అందించనున్నది. నిపుణులు ఈ నిర్ణయాన్ని ఆర్థిక వ్యవస్థలో ఒక పాజిటివ్ అడుగుగా విశ్లేషిస్తున్నారు. సెప్టెంబర్ 22 తో జీఎస్టీ 2.0 ప్రజల దైనందిన జీవితంలోకి ప్రవేశించనుంది.
#GST #GSTIndia #GSTUpdate #GST2025 #TaxReforms #IndirectTax #Finance #Business #Accounting #GSTCompliance #GSTR #Taxation #India #TaxUpdates #Economy
No comments:
Post a Comment