Thursday, February 2, 2017

పరశురామేశ్వరస్వామి దేవాలయము, గుడిమల్లం, చిత్తూరు జిల్లా

గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం.చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాలద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.

ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.

గుడిమల్లం శివాలయం లోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది.ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము మరియు ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము మరియు క్రింది పొడవైన స్తంభభాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు.ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం .ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది.ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది.
ఈ ఆలయానికి సమబంధించి మరియొక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉంది. అది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపలభాగం మొత్తం వరద నీటితో మునుగి పోతుంది.. ఒక చిన్న భూగర్భ తొట్టి మరియు దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం ప్రక్కన నేటికీ కూడా చూడవచ్చు. ఈ వరద నీరు అకస్మాత్తుగా, శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది. ఈ భూగర్భ ట్యాంక్ తరువాత ఎండి పోతుంది. ఇది 2005 డిసెంబరు 4 లో జరిగినట్ల తెలుస్తోంది. ఆ వరద నీరూ అలానే ఒక 4 గంటలు ఉండి అటుపై మరల ఆలయంలో ఏమీ జరుగనట్లు అదృశ్యమైనదని తెలుస్తుంది. రామయ్య అనే 75 ఏళ్ళ గ్రామస్థుడు దీనిని తాను 1945 సం.లో చూచినట్లు తెలిపినట్లు పలువురు వివరించిరి.

పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము మరియు దక్షిణాయనములో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటి నేరుగా వస్తాయి.

విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణమున యెన్నియో చిన్న గుళ్ళున్నవి. అన్నింటిని చుట్టునూ, ఆవలి ఇటుక ప్రాకారగోడ, నలువైపుల ఉంది.ఈ ప్రాకారమునకు పడమటివైపున పెద్ద గోపుర ద్వారము ఉంది. ఈ గోపురద్వారము, మరియు స్వామివారి అభిషేకజలమునకూ కట్టిన బావి యాదవదేవరాయలు కాలమునకు (క్రీ.శ.13-14 శతాబ్దము) చెందినది. ముఖ్య దేవాలయము- పరశురామేశ్వరస్వామి పేరున పలువబడుచున్నది. ఈ ఆలయమునకు వాయవ్య దిశన అమ్మవారి దేవాలయము ఉంది. దానిని ఆనుకొని దక్షిణమున వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి ఉంది. పై రెండును తూర్పు ద్వారమును కల్గిఉన్నవి. తూర్పు చివర ఆనుకొని సూర్యనారాయణుని దేవాలయము ఉంది. ఈ చిన్ని ఆలయమును బహుసా మరికొన్ని శిథిలములై ఉండవచ్చును. మరికొన్ని పరివార దేవతల గుళ్ళు ఉన్నాయి. గోడలపైని, రాతిపలకలపైని పెక్కు శాసనములు ఉన్నాయి. ఇవి తరువాతి పల్లవులు, వారి సామంతులు గంగ పల్లవులు (క్రీ.శ. 897-905), బాణ చోళులు, చోళరాజు విక్రమచోళుడు, రాజరాజు కాలమునకు చెందినవి. యాదవ దేవరాయల కాలమునాటికి చెందిన మరికొన్ని శాసనములు ఉన్నాయి. విక్రమ చోళుడు కాలమున (క్రీ.శ.1126) దేవాలమును పూర్తిగా తిరుగ కట్టినట్లు, రాతితో కట్టడములు చేసినట్లు తెలియుచున్నది. దేవాలయములో విశాలమైన మహామండపము గర్భగుడి ఆవలివైపు దాని ఆనుకొని ఎత్తైన రాతి ప్రాకారమును కలుపుచున్న అరుగు, నలుప్రక్కల ప్రదక్షిణమునకు వీలుగా స్తంభములపై శాల నిర్మింపబడెను.ఈ కాలమున మహామండపమునకు దక్షిణముగా ముఖద్వారము, దానికి నేరుగా ప్రాకారమును కూడా కుడ్యస్తంభములతో చక్కని ద్వారశాలను ఏర్పరచిరి. గర్భగుడి మాత్రము గజపృష్ఠాకారము కలిగి ఉంది. అందున అర్ధ మండపము మహామండపములు ఉన్నాయి. అన్నియు తూర్పు ముఖద్వారములు కలిగి ఉన్నాయి. గర్భగుడి, అర్ధ-మహామండపముల కన్న, చాలా పల్లములో ఉంది. అందువల్లనే కాబోలు ఈ గ్రామనామము గుడిపల్లము అని వాడుకలో ఉంది. శివుని ప్రతిమ, యవ్వనుడైన మల్లునిబోలి ఉన్నందున గ్రామనామము గుడిమల్లము అని ప్రతీతి. కాని శాసనములలో ఎక్కడా ఈనామము కానరాదు. ఈ గ్రామాన్ని విప్రపీఠముగా పేర్కొనబడెను.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...