ఉగాది పండుగ
ఉగాది పండుగ వస్తోంది - ఉత్సాహాన్ని తెస్తోంది
ఉగాది పండుగ వస్తోంది
ఉత్సాహాన్ని తెస్తోంది
ఊరంతా సంతోషం
ఉరకలు వేసే సందోహం
ఉప్పు, పులుపు, చెరుకు, చేదు
ఉపాహారం ఈ రోజు ప్రత్యేకం
ఉదయం తలంటు పోత
ఉత్సాహం కొత్త బట్టల జత
ఊరి దేవత సంబరం
ఉత్కంట గొలిపే వినోదం
ఉగాది పంచాంగ శ్రవణం
ఊరట ఇచ్చే గోచారం వివరం
ఉంది ఉంది మంచి పొంచి
ఉన్నది గ్రహాల బలం
ఊరికి కొంచెం ఉపకారం
ఉగ్ర గ్రహాల శాంతికి దానం
ఉన్నత స్థితికి సోపానం
ఉద్వాసన - ఇబ్బందులు మాయం
ఉగాది పండుగ ధ్యేయం
ఉత్సాహాన్ని పెంచడం
చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది పండుగగా పరిగణిస్తారు.
ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేస్తారు. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ తరువాత భగవంతుడిని పూజించాలి. పూజ అయిన తరువాత పెద్దల దీవెనలను పొందడం, దేవాలయాల సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయి.
ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం, వేప పువ్వు చేదు, మామిడి పిందె వగరు, కొత్త బెల్లం తీపి కొత్త చింతపండు పులుపు, పచ్చి మిర్చికారం, ఉప్పు. ఉదయాన్ని ముందుగా ఈ పచ్చడి తినడము తెలుగు వారి సామ్ప్రదాయమ్. హోలీ పండుగకు కూడా మామిడి పిందెలు తినాలి అని ఉండడము మనము గమనిస్తే ఆ కాలములో వచ్చే కాయలను పండులను తినడము ఆరోగ్యానికి మంచిది అని మనకు పెద్దలు చెప్పినట్టు గ్రహించవచ్చు.
ఉగాది పండుగ దినాన భద్రాద్రి శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయని ఆద్యాత్మిక గురువులు అంటున్నారు. శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని నమ్మకం. శ్రీ మద్రామాయణ పారాయణ శ్రీ రామనవమి వరకు చెయ్యచ్చు అని కూడా మనము అన్వయిన్చుకోవచ్చును.
No comments:
Post a Comment