మనోబలానికి ఆత్మనిగ్రహం ఇంధనం. ఇది సాధించడం అంత సులువేమీ కాదు. భృగు, దూర్వాస, విశ్వామిత్రుల వంటి మహర్షులే కొన్ని సందర్భాల్లో కామ, క్రోధాది రాగద్వేషాలకు లోనయ్యారు. ఆత్మనిగ్రహానికి నిలువెత్తు దర్పణం శ్రీరాముడు. మానవుడు ఈ సమాజంలో ఎలా మసలుకోవాలో ఆచరించి చూపిన దైవస్వరూపుడాయన. లీలా మానుష విగ్రహధారి శ్రీకృష్ణుడు మానవాళి ఏం చేయాలో చెప్పి గీతాచార్యుడయ్యాడు. దృఢసంకల్పంతో ఆత్మనిగ్రహం సాధించినవారు ఈ కాలంలోనూ ఉన్నారు. సత్యమార్గంలో అహింస అనే ఆయుధంతో అతిపెద్ద దేశాన్ని బంధవిముక్తం చేసినవాడు మహాత్మాగాంధీ
ప్రపంచాధిపత్యం కోసం అర్రులు చాచిన అలెగ్జాండర్, హిట్లర్ వంటివారు లోపలి రాగద్వేషాలను జయించలేక పరాజితులయ్యారు. సాధనతో సాధ్యం కానిది లేదు ఎంతటి వారికైనా క్రోధం, స్వార్థం వంటి గుణాలు వెన్నంటే ఉంటాయి. అవి ప్రకోపించినప్పుడే ఆత్మనిగ్రహం అవసరమవుతుంది. వ్యక్తిత్వ వికాస బోధకులు ఈ అంశాన్నే తరచూ ప్రస్తావిస్తుంటారు.
మన దైనందిన జీవితాల్లో ఉద్యోగ, వ్యాపార సంబంధాల కారణంగా అనేకమందితో మాట్లాడవలసి వస్తుంది. వారందరూ మునులు, యోగులు కారు! అది గుర్తెరిగి మనమే ఆత్మనిగ్రహం పాటించాలి ఆవేశం అనర్థదాయకం- సహనం సర్వజనామోదం' అన్న సూక్తి అందరికీ తెలిసిందే. అయినా ఆచరణలో ఇది కనిపించదు. కారణం ఆత్మనిగ్రహ లోపం! ఆవేశం వల్లనే కోపం వస్తుంది. బుద్ధి మసకబారుతుంది. మాటలు పెళుసుబారుతాయి. పర్యవసానంగా అవతలి వ్యక్తుల్లోనూ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఫలితం అనర్థం! అందుకే మనం శాంత స్వభావులం కావాలంటే మనోబలం పెంచుకోవాలి. ఏకాగ్రతతో ఆత్మనిగ్రహ సంకల్ప సాధనకోసం ఆలస్యం ఎందుకు? ఈ క్షణమే శుభముహూర్తం
No comments:
Post a Comment