Thursday, May 6, 2021

తీర్థయాత్ర - విది విధాన

పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం అనాదిగా ఉన్న ఆచారం. కానీ ఎక్కువమంది దృష్టిలో తీర్థయాత్ర అంటే ప్రయాణం చేసేయడం, అక్కడి దేవుణ్ణి దర్శించుకోవడం, తిరిగిరావడం – ఇంతే ! కానీ తీర్థయాత్ర అంటే కేవలం ఇవే కావు. ఓ పుణ్యక్షేత్రానికి యాత్ర చేసేటప్పుడు పాటించాల్సిన విధినిషేధాలు కొన్నున్నాయి.

1. ఏ దేవుడి క్షేత్రానికి వెళ్తున్నామో ఆ దేవుడి పూజ ముందస్తుగా కొన్నిరోజుల పాటు ఇంట్లో చేయాలి. కనీసం స్తోత్రాలైనా చదవాలి. ఆ దేవుడి గుఱించి ఏదైనా పవిత్ర గ్రంథం ఉంటే దాన్ని కనీసం ఓ సప్తాహం పాటు పారాయణ చేయాలి. ఆ తరువాతే యాత్రకి బయల్దేఱి వెళ్ళాలి. అప్పుడు మన యాత్ర నిరాటంకంగా జఱిగేలా ఆయన ఆశీర్వదిస్తాడు.

2. ఇలా వెళ్ళి, అలా వచ్చేయడం కాకుండా, కనీసం రెండు-మూడ్రోజుల పాటైనా ఆ క్షేత్రంలో గడిపి, తద్ద్వారా ఆ భగవత్సన్నిధాన అనుభూతి విశేషాలతో మన మనస్సులు సంపూర్ణంగా పరిప్లావితం అయ్యేలా యాత్రా ప్రణాళిక వేసుకోవాలి.

౩. మొక్కుబడి తీర్చుకోవడం కోసం వెళుతున్న పక్షంలో అందుకోసం కట్టిన ముడుపును కూడా మర్చిపోకుండా వెంట తీసుకెళ్ళాలి. ఆ దేవుడు మన ఇష్టదైవం గానీ, ఇలవేల్పు గానీ అయిన పక్షంలో ఆయనకి ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు సమర్పించిన ధనరూపకమైన దక్షిణల్నీ, ధాన్యాన్నీ కూడా ఆ దేవాలయంలో సమర్పించడం కోసం తీసుకెళ్ళాలి.

4. పుణ్యక్షేత్రాల్లో చేసే పారాయణలు విశేష ఫలితాన్నిస్తాయి. కనుక యాత్రా సమయం లోనూ,  పుణ్యక్షేత్రం లోనూ చదువుకోవడం కోసం కొన్ని చిన్నచిన్న పుస్తకాలు కూడా వెంట తీసుకెళ్లాలి. ఉదాహరణకి – విష్ణుసహస్రనామాలు, వివిధ దేవీదేవతల స్తోత్రసంపుటాలు మొ||వి. కార్లో వెళ్ళేవారు దేవుడి దృశ్యక, శ్రవ్యక క్లుప్తికలను (CDs) దగ్గఱ పెట్టుకుని కదలాలి.

5. పిల్లల్ని బడి మానిపించైనా సరే, తీర్థయాత్రకి అవశ్యం తీసుకెళ్ళాలి. ఆ బాల్యదశ లో కాకపోతే వారింక ఎప్పటికీ ఆధ్యాత్మికతకీ, మత సంప్రదాయాలకీ పరిచితం కారు. వారికి సంస్కృతీ, సంప్రదాయమూ అలవడనే అలవడవు. వాటిని బళ్ళల్లో నేర్పరు. తల్లిదండ్రులే వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని నేర్పాలి ...  

  చిన్నప్పట్నుంచీ హిందూ సంప్రదాయానికి వారిని అలవర్చకపోతే వారి తరంలోనో, వారి వారసుల తరంలోనో మతం మారే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ రోజున్నట్లే ఱేపు కూడా ఉంటుందని అనుకోకూడదు. హిందూ తల్లిదండ్రులు తమ నిర్లక్ష్యం ద్వారా తమ పిల్లల జీవితాల్లో సృష్టించిన ఆధ్యాత్మిక శూన్యాన్ని వేఱే ఎవఱో తమ మతంతో భర్తీ చేసేందుకు కాచుక్కూర్చుంటారని మర్చిపోవద్దు.    

6. యాత్రని రహస్యంగా ఉంచకూడదు. సాధ్యమైనంత వఱకూ పరిచయస్థులందఱికీ తెలియజేయాలి. వారిలో యాత్రకి రాలేని వారుంటే వారు తమ తరఫున పదో పరకో, లేకపోతే కొన్ని వస్తువులో దేవుడికి సమర్పించమని ఇస్తారు. వాటిని కూడా వెంట తీసుకెళ్ళాలి. భక్తులంటే భగవంతుని స్వరూపాలే. వారికి సేవ చేయడం భగవంతుడికి సేవ చేయడమే.

7. అప్పుచేసి, లేదా ఇతరుల్ని పీడించి సంపాదించిన ద్రవ్యంతో యాత్ర చేయకూడదు.

8. యాత్ర చేస్తూండగా దైవేతర, లౌకిక సంభాషణల్లో సాధ్యమైనంత వఱకూ పాల్గొనకుండా ఉండడానికే ప్రయత్నించాలి. నిరంతరం భగవన్నామాన్ని, స్తోత్రాల్నీ వల్లిస్తూ ముందుకు సాగాలి. భగవత్సంబంధమైన సత్కథల్ని తోటివారితో చెబుతూ ప్రయాణం చేయాలి. ఎవఱితోనూ ఏ విధమైన చర్చలూ, వాదాలూ, తర్కాలూ చేయకూడదు. ఇతరులు ఏదైనా పొఱపాటు మాట్లాడితే దాన్ని సవరించే పని పెట్టుకోకూడదు.

9. కామక్రోధాది అరిషడ్వర్గాల్ని ఉపశమింపజేసుకోవాలి. శత్రువుల్నీ, దురదృష్టాల్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. యాత్రలో తారసపడేవారందఱినీ స్నేహభావంతో చూడాలి.

10. దారిలో మనకు కలిగే ఆకలిదప్పుల్నీ, అలసటనీ, అనారోగ్యాల్నీ, అసౌకర్యాల్నీ భగవత్ ప్రసాదంగా భావించి ఆనందంగా భరించాలి. పూర్వజన్మ దుష్కర్మ ఈ యాత్రాక్లేశాల ద్వారా హరించుకు పోతోందనీ, ఆత్మ పరిశుద్ధమవుతోందనీ భావించి సంతోషించాలి. అంతే తప్ప “అది బాలేదు, ఇది బాలేదు” అని మాటిమాటికీ వ్యాఖ్యానించుకొని మనసుని కష్టపెట్టుకోకూడదు. యాత్రకొచ్చింది తినడానికో, తాగడానికో, జీవితాన్ని ఆస్వాదించడానికో, కాలకృత్యాలు తీర్చుకోవడానికో కాదనీ, దైవసన్నిధానాన్ని అనుభూతి చెందడానికేననే విషయాన్ని అనుక్షణం గుర్తుంచుకొని ప్రవర్తించాలి. ఆయా అవసరాలు ఎలా తీఱినా ఫర్వాలేదన్నట్లు మసలుకోవాలి. దైవానుభూతికి మినహా ఇంకా దేనికీ ప్రాధాన్యం ఇవ్వకూడదు.   

11. తీర్థగమ్యాన్ని చేఱుకున్నాక ముందు చేయాల్సిన పని స్నానాదులు ముగించి ఎంతో కొంత ఆహారంగా తీసుకోవడం. సుప్రసిద్ధ క్షేత్రాలైతే దైవదర్శనానికి గంటలకొద్దీ సమయం పట్టవచ్చు. తినడం ఆలస్యమయ్యే కొద్దీ, వరుసలో నిలబడ్డా మనసు దేవుడి మీదికి కాక తిండి మీదికే పోతూంటుంది. కనుక ఖాళీకడుపుతో దైవదర్శనం చేయలేం.

12. దైవదర్శనానికి వెళ్ళే దారిలో ఎన్ని ఆకర్షక విషయాలూ, వస్తువులూ ఉన్నా ఆగకుండా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవాలి. భారీ బ్యాగులూ, పెట్టెలూ మొదలైన సరంజామాతో వెళ్ళడం చాలా అసౌకర్యం. అలా తీసుకెళ్తే చిత్తం దేవుడి మీద కాక వాటి మీదే లగ్నమై ఉంటుంది.

13. కొన్ని క్షేత్రాలలో ప్రధాన దైవతం కాక మఱో దేవుడో, దేవతో వేంచేసి ఉంటారు. ముందు వారిని దర్శించుకున్నాకనే ప్రధాన దైవతాన్ని దర్శించాలనే సంప్రదాయం ఉంటుంది. దాన్ని తు.చ. తప్పకుండా పాటించాలి. ఉదాహరణకి – తిరుమలలో శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నాకనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్ళాలి. అలాగే శ్రీస్వామి వారిని దర్శించాక తిరుచానూరులో శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి.

14. “రిక్తహస్తేన నోపేయాద్ రాజానం దైవతమ్ గురుమ్” అన్నారు పెద్దలు. కనుక దైవ దర్శనానికి వట్టి చేతులతో వెళ్ళకూడదు. అందులోనూ సమాజంలో కాస్తో కూస్తో స్థితిమంతులనిపించు కుంటున్నవారు దేవుడి దగ్గఱికి చేతులూపుకుంటూ వెళ్ళనేకూడదు. పూలదండలు, పండ్లు, కొబ్బరికాయ, తాంబూలం, దక్షిణద్రవ్యం, క్రొత్తవస్త్రాలూ, ఏదైనా వెండి/ బంగారు వస్తువూ – వీటిల్లో ఏదో ఒకటి గానీ, కొన్ని గానీ, అన్నీ గానీ సమర్పణగా తీసుకెళ్ళాలి. కొన్ని క్షేత్రాల్లో ప్రధాన దైవతానికి కొన్ని ప్రత్యేక సమర్పణ లంటే ప్రీతి కనుక అవేంటో కనుక్కుని అవి కూడా తీసుకెళ్ళాలి.

15. దేవుడికి సమర్పించిన పూలదండల్నీ, తినుబండారాల్ని, వస్త్రాల్నీ ఆయన ప్రసాదంగా వెనక్కి తీసుకోవచ్చు. కానీ ఆయనకు సమర్పించిన డబ్బునీ, వెండి/ బంగారు ఆభరణాల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తీసుకోకూడదు. 

అలా చేస్తే  అమ్మ వార్లు చాలా బాధపడతారు. మనకు జన్మజన్మల దరిద్రం చుట్టుకుంటుంది. ఈ సంగతి తెలీక చాలామంది ఆడవాళ్ళు అమ్మవార్ల దర్శనానికి వెళ్ళినప్పుడు నగలతో వారిని అలంకరింపజేసి ఆ తరువాత మళ్లీ వాటిని వెంట తీసుకెళుతున్నారు. “దేవుడికి ఇంత ఇవ్వాలి” అని మనసులో అనుకుని, లేదా ఆ మాట పైకి అనేసి ఆ తరువాత మనసు మార్చుకోవడం కూడా మహాదోషం.

16. అలాగే దేవుడి కోసం బయటికి తీసిన డబ్బుని యథాతథంగా సమర్పించేయాలే తప్ప, “ఈ నోటు తీసుకుని ఇంత చిల్లఱ నాకు వెనక్కివ్వండి” అని అడక్కూడదు. మనం అక్కడికి వెళ్ళినది దేవుణ్ణి శరణాగతి వేడడానికే తప్ప ఆయనతో బేరసారాలూ, వ్యాపారమూ, నగదుమార్పిడి చేయడానికి వెళ్ళలేదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి.

17. ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడి స్థానిక ఆచార వ్యవహారాలన్నింటినీ వినయ విధేయతలతో పాటించాలే తప్ప “ఇవన్నీ నిజమా ? వీటి వల్ల ఏమైనా ప్రయోజనముందా ? దీనివల్ల గుడి సిబ్బందికేమైనా లబ్ధి చేకూఱుతోందేమో ? మమ్మల్ని ఎందుకింత కష్టపెడుతున్నారు ? ఫలానా గుళ్ళో ఇలా లేదే ? ఇక్కడెందుకు ఇలా ఉంది ?” అని వితండవాదాలూ, విమర్శలూ, తర్కాలూ చేయకూడదు. పుణ్యక్షేత్రాల్లో అశ్లీలాలూ, అవాచ్యాలూ పలకరాదు.

18. పుణ్యక్షేత్రాల్లో రాజకీయాలూ, క్రీడలూ, సినిమాలూ, పెట్టుబడివ్యాపారాలూ, విద్యా-ఉద్యోగావకాశాలూ, లోకాభిరామాయణమూ మాట్లాడరాదు. వారపత్రికలూ, వార్తాపత్రికలూ, కథలూ, నవలలూ చదవరాదు. భార్యతో గానీ, ప్రియురాలితో గానీ సరసాలాడరాదు. భగవంతుడికి తప్ప ఇంకెవఱికీ జై కొట్టరాదు, పొగడరాదు. పరనింద, ఎగతాళి చేయరాదు.

19. ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా వివర్జించాలి.  

20. కొంతమంది పుణ్యక్షేత్రాల్లో చనిపోతే సద్గతి లభిస్తుందనుకుని అక్కడికెళ్ళి ఆత్మహత్యలు చేసుకుంటారు. అలాంటిచోట్ల కాలిక మరణం, లేదా సాధారణ మరణం పొందితేనే సద్గతి. ఆత్మహత్య చేసుకుంటే మటుకూ దుర్గతే. ఆత్మహత్య చేసుకోవడమంటే భవిష్యత్తు మీదా, తద్ద్వారా భగవంతుడి మీదా నమ్మకం లేదని ఆచరణాత్మకంగా, బహిరంగంగా ప్రదర్శించడమే. అది దైవవిశ్వాసానికి ఎంతమాత్రమూ ప్రతీక కాదు. అలా చనిపోయేవారికి పిశాచ, బ్రహ్మరాక్షస జన్మలే గతి.   

21. ఒకానొక పుణ్యక్షేత్రంలో మనుషులూ, స్థలాలూ మనకు నచ్చకపోయినా విమర్శించకూడదు. ఆ విమర్శలు నేరుగా అక్కడి దేవుడికే తగుల్తాయి. పుణ్యక్షేత్రమైనా, కాకపోయినా అందఱిలోనూ భగవంతుడే ఉన్నాడు గనుక ఎక్కడైనా సరే, పరనిందా, భగవన్నిందా రెండూ వేఱు కాదు.    

22. కొన్నికొన్ని క్షేత్రాలలో స్థలమహాత్మ్యమూ, భగవద్వరప్రసాదమూ మూలంగా కొన్నికొన్ని రకాల విశేష సాధనలు చేస్తే త్వరగా కోరికలు తీఱతాయి. అవేంటో అక్కడ జనాన్ని అడిగి తెలుసుకుని ఆ ప్రకారంగా అనుష్ఠించాలి.

23. దర్శనం కాగానే “హమ్మయ్య” అనుకుని బయటపడొద్దు. గుళ్ళోనో, గుడి బయట అరుగు మీదనో, చెట్టు కిందనో కూర్చుని భగవంతుడి స్తోత్రాలు చదువుకుని, లేదా జపధ్యానాదుల్లాంటివి చేసుకుని ఆ తరువాతే లేవాలి. ఇలా చేసేటప్పుడు వట్టి నేలమీద కాకుండా ఏదైనా ఓ ఆసనం (చిట్టిచాప, వస్త్రం, తెల్ల కాయితం లాంటివి) వేసుకుని చేయాలి. అలా కాక వట్టి నేలమీద కూర్చుని చేసే ఉపాసనల ఫలం భూదేవికీ, తద్ద్వారా బలి చక్రవర్తికీ చెందుతుంది.

24. అక్కడ ఎవఱైనా చేయి చాపితే మనకు తోచినంత, మనం ఓపినంత దానం చేయాలి. పుణ్యక్షేత్రంలో చేస్తున్న దానం కనుక దానికి విశేష ఫలితం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే ఇవ్వనక్కఱలేదు. కానీ యాచకుల్ని విసుక్కోవడం, కసురుకోవడం, దూషించడం, బుద్ధి చెప్పడం లాంటివి మంచివి కావు. ఇష్టం లేకపోతే మౌనంగా అక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి.

25. ఈ రోజుల్లో లౌకిక ప్రభుత్వాల నిర్లక్ష్యం మూలాన పుణ్యక్షేత్రాలున్న ఊళ్లల్లో సినిమా హాళ్ళూ, వ్యభిచార గృహాలూ కూడా చొఱబడ్డాయి. “దర్శనమైపోయింది గదా” అని చెప్పి వాటికేసి దృష్టిసారించరాదు. పెద్దలేమన్నారంటే-

శ్లో|| అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |

పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి ||

తాత్పర్యం – ఇతర ప్రదేశాల్లో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం సిమెంటులా పట్టుకుంటుంది.

26. తీర్థయాత్ర చేసినందుకు గుర్తుగా అక్కడి వస్తువుల్నీ, విగ్రహాల్నీ, స్థలపురాణ గ్రంథాల్నీ తప్పనిసరిగా కొనాలి. వీలైతే కొన్ని ఎక్కువ పుస్తకాలే కొనాలి. ఇంటికి వెళ్ళాక వాటిని ఇతరులకిచ్చి చదివిస్తే వారికీ ఆ తీర్థయాత్ర చేయాలనే కోరిక కలుగుతుంది. పుణ్యక్షేత్రం నుంచి తెచ్చిన ప్రసాదాల్ని కేవలం తామారగించడమే కాకుండా తమ బంధుమిత్రులకీ, ఇఱుగు పొఱుగు వారికీ కూడా పంచాలి.

27. యాత్రలో పొందిన మధురానుభవాల్ని మాత్రమే ఇతరులతో చెప్పాలి. “ఓయమ్మో, అంత కష్టపడ్డాం, ఇంత కష్టపడ్డాం” అని వాపోకూడదు. అది భగవంతుణ్ణి విమర్శించడమే అవుతుంది. అదే విధంగా ఇంటికెళ్ళేటప్పుడు/ వెళ్ళాక  “యాత్రకంతా కలిపి మొత్తం ఎంత ఖర్చయింది ?” అని లెక్కలు వేయకూడదు. అలాంటివి యాత్రకి బయల్దేఱక ముందే వేసుకోవాలి.

మొత్తమ్మీద తీర్థయాత్రకి వెళ్ళి సాధ్యమైనంత పుణ్యధనాన్ని మూటగట్టుకు రావాలి, పాపాల్ని కాదు.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...