Thursday, May 6, 2021

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి

బ్రహ్మగారు ఈ భూమి మీద జీవ సృష్టి చేస్తూ మొదటగా

మనిషిని- ఎద్దును- కుక్కను - గుడ్లగూబను పుట్టించి ఒకొక్కరూ నలభై సంవత్సరాలు బతకండి అని ఆదేశించాడు.

సహజంగా మానవుడు ఓన్లీ 40 ఇయర్సేనా సార్ అన్నాడు.  అప్పుడు బ్రహ్మ గారు ఒకసారి ఇచ్చిన ఆర్డర్ కు తిరుగుండదోయ్ అన్నాడు.

అక్కడే ఉన్న ఎద్దు నాకు 40 ఏళ్లు ఎందుకుసార్ - ఎప్పుడూ పొలాలు దున్నుతూ, బళ్లను లాగుతూ ముల్లుకర్రతో పొడిపించుకుంటూ - నాకు 20 ఏళ్ళు చాలుసార్ అందోలేదో వెంటనే అక్కడ ఉన్న మానవుడు - ఆ 20 నాకివ్వండి నాకివ్వండి అనగానే - బ్రహ్మ గారు మీలో మీరు అడ్జస్టయితే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు (ఇప్పుడు మానవుడికి 60 ఏళ్ల వయసయింది).

ఆ వెంటనే అక్కడ ఉన్న కుక్క  నాకు మాత్రం 40 ఏళ్లు ఎందుకు  - ఎక్కే గుమ్మం  దిగే గుమ్మం  అందరూ ఛీ ఛీ అనే బతుక్కి 20 ఏళ్లు చాలు అనగానే ... మళ్లీ మానవుడు ఆ 20 నాకే నాకే  అనగానే బ్రహ్మ గారు ఓకే ఓకే అనేశారు ( ఇప్పుడు మానవుడికి 80 ఏళ్ల వయసయింది).

చివరలో ఉన్న గుడ్లగూబ కూడా సామీ నన్ను చూస్తేనే అసహ్యంగా అపశకునంలా భావిస్తారు...తల అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంటాను..సరిగా కనపడదుకూడా కాబట్టి  జంతువులందరిలా నాక్కూడా 20 ఏళ్లు చాలు సామీ అనగానే  - అందుకోసం ఎదురుచూస్తూన్న మానవుడు - అదికూడా నాకే నాకే అనుకుంటూ 100 ఏళ్లూ పూర్తయ్యాయని తెగ సంబరపడ్డాడు.

అందుకే:

మానవుడు తన మొదటి 40 ఏళ్లు మానవుడి గా బతుకుతాడు.

ఆ తరువాత 20 ఏళ్లు ఎద్దు నుండి తీసుకున్న కారణంగా   మానవుడు తన 40-60 ఏళ్ల మధ్యలో ఒక ఎద్దు లా కష్టపడుతూ పిల్లల్ని చదివించి, పెళ్ళిళ్ళు చేసి, ఇల్లు కట్టుకోవడం చేస్తూంటాడు.

ఇక ఆ తర్వాత 20 ఏళ్లు కుక్క నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 60-80 ఏళ్ల మధ్యలో తన ఇంటికి తనే ఓ కాపలాదారుగా మారిపోయి

వచ్చి వెళ్ళే వాళ్ళ ఆరా తీసుకుంటూ,  కోడుకు, కోడలు , మనవలు ఇచ్చే ఆర్డర్లు తీసుకొంటూ కాలక్షేపం చేస్తోంటాడు.

ఇక చివరి 20 ఏళ్లు గుడ్లగూబ నుండి తీసుకున్న కారణంగా మానవుడు తన 80-100 ఏళ్ల మధ్యలో ఎప్పుడు ఈలోకం నుంచి వెళిపోతాడోనని ఇంట్లో వాళ్ళు ఇతగాడికి ప్రొమోషన్ ఇచ్చి ఇతని మకాం వరండాలోకి మార్చిన కారణంగా... పాపం ఆ కుక్కిమంచంలోనే అన్నీ కానిస్తూ, కనపడక పోయినా గుడ్లగూబ లా తల ఇటూ అటూ తిప్పుతూ  ఆ దేవుడి పిలపుకై ఎదురు చూస్తూ ఉంటాడు.

"ఇదే మానవుల నూరేళ్ళ చరిత్ర".

మళ్ళీ ఆ మానవుడే అంటాడు : దురాశ దుఃఖానికి చేటని - దేవుడు ఇచ్చిన దానికంటే అతిగా ఆశపడకూడదని. 

 ( ఎక్కడో ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం విన్న కధకు ఈ అక్షర రూపం ఇచ్చే చిన్నప్రయత్నం)

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...