ఆగస్టు 17 బుధవారం బలరామ జననం సందర్భంగా
బలరాముడు అనగానే నాగలిని ఆయుధంగా ధరించిన బలమైన రూపంతో మనకు గోచరిస్తాడు. బలరాముడు శ్రీకృష్ణుడికి అగ్రజుడు. విష్ణుమూర్తి దశావతారాల్లోని బలరాముడు కూడా ఒక అవతారమని చెబుతారు. చివరి వరకు శ్రీకృష్ణుని వెన్నంటి ఉంటూ ఆ అవతార ప్రయోజనం సిద్ధించడానికి కృషిచేసాడు. శ్రావణ బహుళ షష్ఠి తిథిన బలరాముడు జన్మించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. బలరాముని ఆయుధం హలం కనుక ఈ రోజును హలషస్తే అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో భాద్రపద తదియ రోజున బలరాముని జన్మోత్సవాన్ని జరుపుకుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమ రోజున, అక్షరతృతీయ రోజున కూడా బలరామ జన్మదినాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు.
బలరాముడు వసుదేవుని కొడుకు. శ్రీకృష్ణుని సోదరునిగా, అవతరించాడు. ఆదిశేషుడే బలరామునిగా అవతరించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. ఈయనకి మరో పేరు సంకర్షణుడు. అంటే ఒక గర్భం నుంచి మరొక గర్భంలోకి లాగబడినవాడు. అని అర్థం. దేవకీ, వసుదేవులకు పుట్టిన పిల్లలందరినీ కంసుడు చంపివేస్తుంటే, దేవకి ఏడో గర్భాన జన్మించవలసిన బలరాముడు విష్ణుమూర్తి ఆదేశంతో, యోగమాయ సహాయంతో ఆమె గర్భం నుంచి వసుదేవుని మరొక భార్య అయిన రోహిణి గర్భంలోకి వెళ్తాడు. ఆ కాలంలోనే గర్భమార్పిడి పద్ధతి జరిగిందనేది ఆధునికులు గమనించాలి.
దుష్టశిక్షణలో శ్రీకృష్ణుని వెంటే ఉన్నాడు బలరాముడు. బలరాముడు అతి బలవంతుడు. గదాయుద్ధంలో ఆయనకు సాటిఎవరూ లేరు. బలరాముణ్ణి ప్రకృతి తత్త్వంగా చెప్తారు. నాగలితో దున్నిన భూమి నుండి వచ్చిన ఆహారంతో సమస్త జీవరాసులను ఈ ప్రకృతి పోషిస్తుందన్న దానికి సంకేతం ఆయన ఆయుధం. భీముడు, దుర్యోధనుడు ఆయన వద్దనే గదాయుద్ధం నేర్చుకున్నారు. బలరాముడు ఎప్పుడూ నీలంరంగు వస్త్రాలనే ధరిస్తుంటాడని, అయన జండామీద తాటిచెట్టు గుర్తు ఉంటుందని కొన్ని పురాణాలు వర్ణించాయి. బలరాముడు కొన్ని విషయాల్లో శ్రీకృష్ణునితో ఏకీభవించకపోయినప్పటికీ, ఆయనను అతిక్రమించి మాత్రం ప్రవర్తించలేదు. ఇక్కడే బలరామునిలో ప్రకృతి తత్త్వం కనిపిస్తుంది.
ప్రకృతి భగవానుని కంటే వేరుగా కనిపించినప్పటికీ విరుద్ధంగా ప్రవర్తించదు. ఆయన ఆదేశాలకు లోబడే పనిచేస్తుంది. బలరాముడు శ్రీకృష్ణునితో విభేదించినట్లు కనబడినప్పటికీ అసలు ధర్మసూక్ష్మం ఏమిటో మనకు తెలియబరుస్తాడే తప్ప నిజానికి అది విభేదం కాదు. బలరాముడి సాహసం, పరాక్రమం తెలియచెప్పే సంఘటనలు మనకు పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తాయి. జాంబవతి కుమారుడైన సాంబుడు దుర్యోధనుడి కుమార్తెయైన లక్ష్మణను. స్వయంవరం నుంచి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, కౌరవ సైన్యం సాంబుని బంధింస్తారు. ఈ విషయం తెలిసిన యాదవులు, దుర్యోధనుని సైన్యం మీదకి యుద్ధానికి వెళ్తారు. కానీ బలరాముడు వారిని వారించి తానొక్కడే కొద్దిపాటి సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. తన పరాక్రమం చూపిస్తూ తన హలాయుధంతో హస్తినను యమునలో పడేలా కొట్టాడు. ఆ దెబ్బకి హస్తినలో కొంతభాగం యమునలో పడింది. ఇప్పటికీ హస్తినలో (ఢిల్లీ) లోని దక్షిణ భాగం ఒక వైపుకి ఒరిగి ఉందంటారు.
భారత యుద్ధంలో తనకి కౌరవపాండవులిద్దరూ సమానమే కాబట్టి తటస్థంగా ఉంటాడు. యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అలా వింధ్యపర్వత ప్రాంతాలు, దండకారణ్యాన్ని దాటి బలరాముడు తన యాత్ర కొనసాగిస్తున్నాడు. ఓ ప్రాంతంలో ప్రజలంతా కరువు కాటకాలతో తిండి దొరకక విలవిలలాడుతున్నారు. దానికితోడు ప్రలంబసూతి అనే రాక్ష సుడు, అక్కడి ప్రజలను విపరీతంగా వేధిస్తున్నాడు. ఆ రాక్షసుని నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా? అని ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్న తరుణంలో బలరాముడు అక్కడకు చేరుకున్నాడు. ప్రజల బాధలు విని తన హలంతో బలరాముడు ఆ రాక్షసున్ని అంతం చేశాడు. అనంతరం ఆ నాగలిని భూమిపై బలంగా నాటాడు. ఆయన నాగలిని నాటినచోట ఒక జలధార ఉద్భవించి, నాగావళిగా పేరొందింది. అనంతరం బలరాముడు, ఆ నాగావళి నది పక్కనే ఒక మహాలింగాన్ని ప్రతిష్ఠించి, దానికి రుద్రకోటేశ్వరుడని నామకరణం చేశాడు. బలరాముడు ప్రతిష్ఠించిన ఉమారుద్ర కోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు మానవలే కాదు సకల దేవతలు కూడా అక్కడికి చేరుకున్నారని పురాణ కథనం.
No comments:
Post a Comment