Tuesday, November 30, 2021

సహధర్మచారిణి

సనాతన ధర్మంలో భార్య అన్న పదానికి ఉన్న అనేక పదాలలో 'సహధర్మచారిణి' అన్నది విశిష్ట మైనది. 

ధర్మయుతమైన భర్త మార్గాన్ని అన్నివిధాలా తాను అనుసరించి అనుగమించేది అని అర్థంచెప్పుకోవచ్చు. పెళ్లి నాటి ప్రమాణాలు ప్రకారం ధర్మేచ ,అర్థేచ, కామేచ భార్యాభర్తలదిద్దరిదీ ఒకే మార్గం అయితే ఆ దాంపత్యం అన్యోన్య సుఖదాయకంగా ఉంటుంది. ఈ ఆదర్శాన్ని చాటి చెప్పడానికే బ్రహ్మాది దేవతలు తమ సతీమణులకు సగౌరవ స్ధానాలిచ్చి ఆదర్శమూర్తులయ్యారు. తన చతుర్ముఖాలలో  సరస్వతిని నిలిపాడు బ్రహ్మ దేవుడు.అంటే  విధాత రసనాగ్రసీమను (బ్రహ్మ నాలుకనే వేదికగా చేసుకొని) వాణి వేదవాణిగా లాస్యమాడింది. ఇక విష్ణుమూర్తి తన వక్షస్థలం పై లక్ష్మీ దేవిని నిలుపుకొని ఆమెకు హృదయస్థానాన్ని ఇచ్చాడు. దీనర్థం స్వామిది సంకల్పం అయితే అమ్మ సిద్ధిదాత్రి అన్నమాట. వీరిద్దరినీ మించి తన మేనిలో సగభాగమిచ్చి అర్థనారీశ్వరుడయ్యాడు జగదీశ్వరుడు. అంటే తామిద్దరమూ అభిన్నమని విడదీయరానంతగా కలిసి ఉన్నామని తెలపడమే అర్ధనారీశ్వర తత్త్వ పరమార్ధం.

దీన్నే కాళిదాసు మహాకవి రఘువంశంలో

"వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"

'జగత్తుకు తల్లిదండ్రులు ఆదిదంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులు వాక్కు అర్థాలలాగా ఎప్పుడూ కలిసే ఉంటారు. వారు ఈ నా కావ్య రచనకు  అర్థవంతములైన మంచి వాక్కులను ప్రసాదింతురుగాక!' అని నుతిస్తాడు. మాటను అనుసరించే అర్థం వచ్చినట్లుగా సతిపతులిద్దరూ ఒకరిననుసరించి మరొకరు నడుచుకోవాలి. అప్పుడే సంసారంలో ఆనంద సరాగాలు వెల్లివిరుస్తాయి.

లక్ష్మీ నారాయణులు, వాణీ హిరణ్యగర్భులు, శచీపురంధరులు, అరుంధతీ వసిష్ఠులు, సీతారాములు, రాధాకృష్ణులు అని భార్యలతో కలిపి భర్తల పేర్లు స్మరించడం లోకంలో పరిపాటి. కానీ ఒక్క పరమశివుణ్ణి మాత్రం  సాంబశివుడని పిలిస్తే చాలు. స+ అంబ శివుడు అంటే అమ్మతో కూడిన అయ్య . పార్వతీ పరమేశ్వరుల రూపం లాగానే వారి పేర్లు కూడా ఒకటిగా కలిసి పోయాయి. తల్లి జగన్మాత - శివుడు జగదీశ్వరుడు అంటే ఆమె శక్తి - స్వామి శక్తి మంతుడు. దీనికర్థం ఏమిటంటే అమ్మవారి అండ లేనిదే పరమేశ్వరుడు కనీసం కదలను కూడా కదలలేదు. అందుకే సౌందర్య లహరిలో  ఆదిశంకరులు అమ్మవారి తత్వాన్ని ఆవిష్కరించి త్రిమూర్తులకు సైతం వారి వారి శక్తి లేకపోతే చలనమే ఉండదు అని చెప్తారు.

సహధర్మచారిణి స్ధానాన్ని మించిన పదవి ధర్మపత్నికి లభించిందన్నమాట. ఇలా ఒక్కోసారి ఇల్లాలివల్లే ఇంటాయన గౌరవం కూడా పెరుగుతుందని ప్రాచీన స్తోత్రవాఙ్మయం నిరూపిస్తుంది.

"చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో

జటాధారీ కంఠేభుజగపతిహారీ పశుపతిః

కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం

భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదమ్"

"చితిలో బూడిదను భస్మంగా ధరిస్తాడు.విషాన్ని ఆహారంగా స్వీకరిస్తాడు.దిక్కులనే వస్త్రాలుగా ధరించిన దిగంబరుడు, జటలు కట్టిన వెంట్రుకలు గలవాడు, మెడలో విషసర్పాన్నే ఆభరణంగా ధరించినవాడు, కపాలాన్ని చేతదాల్చినవాడు, భూతాధిపతి,పశుపతి అన్నపేరున్నవాడు శివుడు. కానీ ఓ భవానీ! నిన్ను వివాహమాడి నందువల్లనే ఈశుడు జగదీశుడనే గొప్ప పదవిని పొందాడు" అని అంటారు ఆదిశంకర భగవత్పాదులు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో. యమునితో పోరాడి పతిప్రాణాలను దక్కించుకున్న సతీసావిత్రి, త్రిమూర్తులనే పసిబిడ్డలు గా చేసి లాలించిన సతీ అనసూయ వంటి పతివ్రతా శిరోమణులకు నిలయం మన భారతదేశం.

శ్రీమద్రామాయణంలో అశోకవనంలో శోకిస్తున్న  సీతామాతను గురించి చెబుతూ ఆదికవి వాల్మీకి పరమాత్మ కోసం పరితపించే జీవాత్మ లాగా సీతమ్మ ఉంది అంటాడు. జీవాత్మ పరమాత్మ బంధాన్నే దాంపత్య బంధంగా ఆదికావ్యం  రామాయణం నిరూపిస్తుంది.

ఇలా భర్తలను ఆరాధించి, అనుసరించి, అనుగమించి జీవితాంతం సాహచర్యం అందించిన భారతీయ మహిళలు సర్వదా సమాదరణీయలు.

No comments:

పూజారి -- కానుకలు..

పూజారి -- కానుకలు .. మీరు కానుకలు హుండీలోనే వేయండి . పూజారి ప్లేటులో వేయవద్దు ,హుండీలో వేసిన సొమ్ము మాత్రమే భగవంతుడికి చేరుతుంది...