Tuesday, November 30, 2021

తండ్రి ఆశీర్వాదం

తండ్రి ఆశీర్వాదం

అవసానదశలో ఉన్న ఒక తండ్రి తన ఏకైక కుమారుడైన ధరమ్ పాల్ ని పిలిచి, “ప్రియమైన కుమారా, నీకు వారసత్వంగా వదిలివెళ్ళడానికి నేను ఏ సంపదను కూడగట్టలేకపోయాను. కానీ జీవితాంతం నా పని యెడల ఎల్లప్పుడూ నిజాయితీగా, ప్రామాణికంగా ఉన్నానని నీకు నమ్మకం ఇవ్వగలను. 

కాబట్టి, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నీవు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా, విజయవంతంగా ఉంటావు. నువ్వు ఏది తాకినా అది బంగారం అవుతుంది నాయనా! ", అని చెప్పాడు. 
ధరమ్ పాల్ కృతజ్ఞతతో నమస్కరించి, భక్తితో తన తండ్రి పాదాలను తాకాడు. 

తండ్రి ప్రేమగా కుమారుడి తలపై చేయి వేసి, సంతృప్తిగా, ప్రశాంతంగా తుది శ్వాస విడిచాడు.

ఇంటి ఖర్చులు చూసుకోవడం ఇప్పుడు కొడుకు ధరమ్ పాల్ బాధ్యత. అతను తోపుడు బండిపై  చిన్న వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం సమయంతో క్రమంగా అందుకున్న తర్వాత, ఒక చిన్న దుకాణాన్ని కొన్నాడు.

క్రమంగా, వ్యాపారం మరింత విస్తరించింది.  

త్వరలోనే  నగరంలోని సంపన్నులలో, ఐశ్వర్యవంతులలో అతను లెక్కించబడ్డాడు. ఇదంతా తన తండ్రి దీవెనల ఫలితమని అతను నిజంగా విశ్వసించాడు. 

తన తండ్రి ఎన్ని కష్టాలు పడినా సహనాన్ని విడిచిపెట్టలేదు, విశ్వాసం కానీ,  ప్రామాణ్యతను కానీ  కోల్పోలేదు, అందువల్లనే ఆయన మాటలకు అలాంటి శక్తి ఉండి, ఆయన ఆశీర్వాదాలు ఫలించాయి. 
ధరమ్ పాల్ ఎప్పుడూ అందరికీ ఇలా చెప్తూ, తన విజయానికి తన తండ్రి ఆశీస్సులే కారణమని చెబుతూ ఉండేవాడు.

ఒకరోజు ఒక స్నేహితుడు అడిగాడు, “మీ నాన్న అంత శక్తిమంతుడైతే, ఆయన ఎందుకు వృద్ధి చెందలేదు, ఎందుకు సంతోషంగా జీవించలేకపోయాడు?” 

ధరమ్ పాల్ మాట్లాడుతూ, "మా నాన్న శక్తివంతమైన వ్యక్తి అని నేను చెప్పడం లేదు, ఆయన ఆశీస్సులు చాలా శక్తివంతమైనవని నేను చెబుతున్నాను." 

ఎప్పుడూ తన తండ్రి ఆశీర్వాదం గురించి మాట్లాడటం వలన, అందరూ అతనికి 'తండ్రి ఆశీర్వాదం' అని పేరు పెట్టారు. ధరమ్ పాల్ దీన్ని పట్టించుకోలేదు, తన తండ్రి ఆశీర్వాదాలకు అర్హుడిగా మారగలిగితే అదే తనకు గౌరవంగా ఉంటుందని చెప్పాడు.

సంవత్సరాలు గడిచిపోయాయి, ఇప్పుడు తన వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాడు. ఎక్కడ వ్యాపారం చేసినా పెద్ద లాభాలు వచ్చేవి. 

నేను ఎప్పుడూ లాభాలను ఆర్జిస్తున్నాను, నేను ఒక్కసారి నష్టాన్ని అనుభవించాలి అని ఒకసారి ధరమ్ పాల్  కుతూహలపడ్డాడు.

ఒక నష్టపోయే వ్యాపారాన్ని సూచించమని తన స్నేహితుడిని అడిగాడు.  

ధరమ్ పాల్ విజయాన్ని, డబ్బుని  చూసుకొని చాలా గర్వపడుతున్నాడని,  ఆ స్నేహితుడు ఖచ్చితంగా నష్టపోయే వ్యాపారాన్ని సూచించాలి అని అనుకున్నాడు . 

భారతదేశం నుండి లవంగాలను కొనుగోలు చేసి, వాటిని ఆఫ్రికాలోని జాంజిబార్‌కు రవాణా చేసి, అక్కడ విక్రయించమని సలహా ఇచ్చాడు. ధరమ్ పాల్ కు ఈ ఆలోచన నచ్చింది. జాంజిబార్ లవంగాలకు చాలా ప్రసిద్ధి చెందింది. అవి అక్కడ నుండి భారతదేశంలోకి దిగుమతి చేయబడతాయి, ధర కూడా 10-12 రెట్లు అమ్ముడవుతుంది. వాటిని ఇక్కడ కొనుగోలు చేసి అక్కడ విక్రయిస్తే కచ్చితంగా నష్టమే.  

తన తండ్రి ఆశీర్వాదాలు అతనికి ఎంతవరకు సహాయపడతాయో చూడడానికి ధరమ్ పాల్ దీనిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. 

నష్టాన్ని అనుభవించడానికి, అతను భారతదేశంలో లవంగాలను కొని, వాటిని ఓడలో నింపి, స్వయంగా జాంజిబార్ ద్వీపానికి తీసుకెళ్లాడు.

జాంజిబార్ ఒక సల్తనత్. ధరమ్ పాల్ ఓడ దిగి, వ్యాపారులను కలవడానికి పొడవైన ఇసుక దారి పై నడవడం ప్రారంభించాడు. అవతలి వైపు నుండి సైనికులతో పాటు కాలినడకన వస్తూ, సుల్తాన్ లాగా కనపడుతున్న వ్యక్తిని చూశాడు. 

ఎవరని వాకబు చేయగా ఆయన  స్వయంగా సుల్తాన్ అని చెప్పారు. 

వారు ఒకరినొకరు ఎదురుపడ్డప్పుడు, ధరమ్ పాల్ ను పరిచయం చేసుకోమని సుల్తాన్ అన్నాడు. 

అప్పుడు ధరమ్ పాల్ ఇలా చెప్పాడు, "నేను భారతదేశంలోని గుజరాత్‌లోని ఖంభాట్ నుండి వ్యాపారిని, వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చాను." 

సుల్తాన్ అతన్ని వ్యాపారవేత్తగా భావించి తగిన గౌరవంతో మాట్లాడటం ప్రారంభించాడు.
సుల్తాన్‌తో పాటు వందలాది మంది సైనికులు ఉన్నారు కానీ, ఎవరి వద్దా  కత్తులు కానీ తుపాకులు లేకపోవడం ధరమ్ పాల్ గమనించాడు. బదులుగా, వారందరూ తమతో పాటు భారీ జల్లెడలను తీసుకువెళ్తున్నారు. 

అతనికి చాలా ఆశ్చర్యంగా, ఆసక్తిగా అనిపించింది.  వినయంగా సుల్తాన్‌ను, “మీ సైనికులు జల్లెడలను ఎందుకు మోస్తున్నారు?” అని  అడిగాడు.

సుల్తాన్ నవ్వుతూ ఇలా అన్నాడు, “ నేను ఈ ఉదయం సముద్రతీరాన్ని సందర్శించడానికి వచ్చాను, ఇక్కడ ఎక్కడో నా వేలి నుండి ఉంగరం జారిపడిపోయింది. ఇప్పుడు, ఈ ఇసుకలో సరిగ్గా ఎక్కడ పడిందో గుర్తించడం కష్టం, కాబట్టి నేను నా సైనికులను వెంట తెచ్చుకున్నాను. వారు ఇసుకను జల్లించి నా ఉంగరాన్ని వెతుకుతారు.

ఆ ఉంగరం చాలా ఖరీదైనదని అయ్యుండాలి ధరమ్ పాల్ అన్నాడు. 

అలా కాదని సుల్తాన్ ఇలా చెప్పాడు, “నా దగ్గర దానికంటే చాలా విలువైన, లెక్కలేనన్ని ఉంగరాలు ఉన్నాయి, కానీ ఆ ఉంగరం ఒక సాధువు యొక్క ఆశీర్వాదం. 

ఆ సాధువు ఆశీర్వాదం వల్ల నా సల్తనత్  చాలా ధృడంగా, సంతోషంగా ఉందని నేను నమ్ముతున్నాను, కాబట్టి నా మనస్సులో ఆ ఉంగరం విలువ నా సల్తనత్ కంటే ఎక్కువ!”.

అప్పుడు, సుల్తాన్ మళ్ళీ వ్యాపారం గురించి మాట్లాడటం ప్రారంభించి, “అయితే, ఈసారి ఏ వస్తువులు తెచ్చావు?” అని అడిగాడు.

"లవంగాలు", అన్నాడు ధరమ్ పాల్. 
అది విని సుల్తాన్ ఆశ్చర్యపోయాడు.
“ ఇది లవంగాల దేశం, మీరు ఇక్కడ లవంగాలు అమ్మడానికి వచ్చారా? మీకు అలాంటి సలహా ఎవరు ఇచ్చారు? ఖచ్చితంగా, ఆ వ్యక్తి మీ శత్రువు అయి ఉండాలి! ఇక్కడ, మీరు ఒక పైసాతో గుప్పెడు లవంగాలను కొనుక్కోవచ్చు. ఇక్కడ మీ నుండి లవంగాలు ఎవరు కొంటారు, ఇంక  మీరు ఏం సంపాదిస్తారు? ”
ధరమ్ పాల్, “ నేను అదే పరీక్షించాలనుకుంటున్నాను ప్రభూ ! నేను ఇక్కడ ఏమైనా లాభం పొందగలనో లేదో చూడాలి. నాన్నగారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు నేను ఏ వ్యాపారం చేసినా లాభసాటిగా సాగింది. కాబట్టి, ఇప్పుడు ఆయన ఆశీస్సులు ఇక్కడ కూడా పనిచేస్తాయో లేదో చూడాలనుకుంటున్నాను.”

సుల్తాన్ ఇలా అడిగాడు,  “తండ్రి ఆశీస్సులా ! అంటే దాని అర్థం ఏమిటి?!" 

అప్పుడు ధరమ్ పాల్ అతనికి వివరించాడు, *“మా తండ్రి ఆయన జీవితమంతా నిజాయితీ, చిత్తశుద్ధితో పనిచేశారు, కానీ డబ్బు సంపాదించలేకపోయారు. మరణ సమయంలో నా చేతిపై చేయివేసి, నీ చేతిలోని ధూళి కూడా బంగారంగా మారాలని ఆశీర్వదించారు"*,  అని ఆ మాటలు మాట్లాడుతూ, ధర్మపాల్ వంగి నేల నుండి గుప్పెడు ఇసుక తీసుకున్నాడు.
ఇసుకను తన వేళ్ళ మధ్య జారిపోనిస్తూ, సుల్తాన్ ముందు గుప్పిటను తెరిచేసరికి,  ధర్మపాల్, సుల్తాన్ ఇద్దరి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. 

ఇసుక మొత్తం జారిపోయిన తర్వాత ధరమ్ పాల్ చేతిలో వజ్రం పొదిగిన ఉంగరం మిగిలిఉంది.

సుల్తాన్ వెతుకుతున్న ఉంగరం ఇదే. అతను ఉంగరాన్ని చూసి చాలా సంతోషించాడు. 

“ఇది మహాద్భుతం ! ఓ అల్లా, చాలా కృతజ్ఞతలు, మీరు ఒక తండ్రి ఆశీస్సులను నిజం చేసారు!” .

అదే భగవంతుడు సాధువు ఆశీస్సులకు కూడా శక్తిని ప్రసాదిస్తాడని ధరమ్ పాల్ అన్నాడు. 
అది విన్న సుల్తాన్ మరింత సంతోషించాడు. అతను ధరమ్ పాల్ ని కౌగిలించుకొని, "ఇవాళ నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాను" అన్నాడు. 

ధరమ్ పాల్ ఇలా అన్నాడు, “నువ్వు 100 ఏళ్లు జీవించి, నీ ప్రజలను బాగా చూసుకోగాక ! ప్రజలు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, నాకు మరేమీ అక్కర్లేదు."

సుల్తాన్ అది విని ఉప్పొంగిపోయి, “నేను ఈరోజు మీ వస్తువులన్నీ కొంటాను. మీరు కోరుకున్నంత ధర ఇస్తాను”, అన్నాడు.
కాబట్టి, ధరమ్ పాల్ తండ్రి ఆశీర్వాదం అక్కడ కూడా అతనిని విఫలం చేయలేదు.

తల్లిదండ్రుల ఆశీస్సులకు అపారమైన శక్తి ఉందని, వారి ఆశీస్సుల కంటే గొప్ప సంపద మరొకటి లేదన్నది వాస్తవ సత్యం.

వారి సేవలో గడిపిన ప్రతి క్షణం ఫలాన్ని ఇస్తుంది. మన పెద్దలను గౌరవించడమే భగవంతునికి మనం చేసే ఉత్తమమైన సేవ.

ఈ  ప్రపంచం అంతా అనేకమైన అవకాశాలుతో నిండిఉంది. సాధ్యమయ్యే సంఘటనకు అవకాశం ఎలాగూ ఉంటుంది, కానీ అత్యద్భుతమైన విషయం ఏమిటంటే, అసాధ్యమైన సంఘటన సాధ్యమయ్యే అవకాశం కూడా ఉంది.

No comments:

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...