ఒక రోజు ఓ నాస్తికుడు అడవిలో అందాలను తన కెమెరా కళ్ళలో బంధించడానికి దట్టమైన అడవిలోకి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి కొన్ని ఫోటోలు తీసుకున్నాడు. సాయంత్రానికల్లా అడవి నుండి బయటపడాలని,తిరుగు దారి పట్టాడు. అలా ఓ గంట నడిచాక కాని అతనికి అర్థం కాలేదు. తాను దారి తప్పి పోయాడని. అసలే అది కృూర మృగాలు కూడా తిరిగే అడవి. ఏదైనా కాని అని ధైర్యం తెచ్చుకుని మరో దారిలో ప్రయాణం కొనసాగించాడు.
ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది. నడక సాగిస్తున్న అతను గుండె చేతిలో పట్టుకుని అక్కడే ఆగిపోయాడు. అతనికి ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మర్రి చెట్టు పక్కన తల దాచుకుని,తెచ్చుకున్న కాసిన్ని నీళ్ళు కూడా తాగేసాడు. పోనీ తన స్నేహితులకి,తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే,అక్కడ సిగ్నల్ అస్సలు లేదు. తనకు తెలియకుండానే 'భగవంతుడా. నాకేంటి ఈ పరిక్ష' అని సణిగాడు.
వెంటనే తనలో తాను 'నా పిచ్చి కాని భగవంతుడే లేడు,ఇంకా ఆయనొచ్చి నన్నేం కాపాడతాడు??' అని అనుకున్నాడు. అయినా తన మనసులో ఓ మూల ఒక్కసారి భగవంతుడు తనని కాపాడమని కోరుకోవాలనుకున్నాడు.
వెంటనే ఆ నాస్థికుడు రెండు చేతులు జోడించి, తన మనసులో 'శివయ్య. నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించి నన్ను రక్షించు.' అని మొక్కాడు. మొక్కిన వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకు వచ్చి పడింది. ఆ బాణం వేగంతో తన పక్కనే పడడం వల్ల ఒక్కసారి ఉలిక్కి పడి గావు కేక వేసాడు ఆ నాస్తికుడు.
ఏం జరిగిందో తనకి అర్థం కాలేదు.
అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి "దొర గారు,ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది! మీరేమైనా చూసారా?" అని అడిగాడు అందుకు ఆ నాస్తికుడు "నేను గంట నుంచి,ఈ చెట్టు కింద గుంట నక్కల కూర్చున్నా. ఈ వైపు ఏ కుందేలు రాలేదు." అన్నాడు.
ఆ వేటగాడు ఆశ్చర్యంగా "నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను!ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చింది! ఇక్కడికొచ్చి చూస్తే ఆ కుందేలు కనిపించడం లేదు, ఈ రోజు వేట వృథా అయినట్టే." అంటూ అడవి నుంచి ఇంటి దారి పట్టాడు.
వెంటనే ఆ నాస్తికుడు "ఆగు ఆగు, నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో ఇక్కడ కూర్చున్న. నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా". అంటూ కొంచం ధీనంగా అడిగాడు. అందుకు, ఆ వేటగాడు-ఆ నాస్తికున్ని తనతో అడవి బయటి మార్గం వైపు తీసుకెళ్ళసాగాడు.
నాస్తికుడు,ఆ వేటగానితో మాటలు కలిపి "నిజానికి నేను దేవుడిని నమ్మను!ఈ అడవిలో మొదటి సారి భయం వేసినపుడు నన్ను కాపాడమని వేడుకున్నా, ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడ లేదు, మనిషే కాపాడాడు, నువ్వే దేవుడి కన్నా గొప్పవాడివి" అన్నాడు.
ఆ మాటలు విన్న వేటగాడు క్షణ కాలం ఆగి" ఏందయ్యా సామి? దేవుడు లేడంటావా?మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు, అలాంటిది రామునికి మాయ లేడి కనిపించినట్టు, ఈ రోజు నాకు అలాంటి కుందేలు కనిపించింది, ఏ జంతువైనా ఒకటి లేదా రెండు బాణాల్లో నేలకొరిగిస్తాను, అలాంటిది, ఈ రోజు నాకు కనిపించిన కుందేలుకి ఎన్నో బాణాలతో కొట్టాను, అయినా ఏ ఒక్క బాణం దానికి తగలలేదు, నేనేంటి ఓ కుందేలుని కొట్టలేకపోవడం ఏంటి అని,పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమయింది. అంతా శివ లీల" అన్నాడు.
దానికి నాస్తికుడు "అంతా శివ లీలనా??ఇదంతా ఆ శివుడు చేయించే బదులు,శివుడే వచ్చి దారి చూపొచ్చు కదా." అని నవ్వుతూ ప్రశ్నించాడు. అందుకు ఆ వేటగాడు "మీకు ఆకలేసినపుడు హోటళ్ళోకి వెళ్ళి కూర్చుంటే,అక్కడి సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కాని ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయడు కదా." అంటూ... ఆ నాస్తికుడు వెళ్ళాల్సిన చోటుకి,తన చూపుడు వేలుతో దారి చూపించాడు ఆ వేటగాడు. ఆ వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి, కొంత డబ్బు తీసి, ఆ వేటగానికి ఇవ్వబోయాడు.
అలా ఇవ్వబోతూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. అతని ముందు,వెనక,మరియు పక్కన తనకి దారి చూపించిన ఆ వేటగాడు కనిపించలేదు. ఆ నాస్తికుడు గుండెలు పిండేసాయి. కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను 'నన్ను రక్షించడం కోసం మాయా కుందేలుని సృష్టించుకుని,నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయట పడవేయడమే గాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా నన్ను బయట పడేసావు! నీవు శివుడివో? శివుడు పంపిన దూతవో నీకే తెలుసు శివయ్య! ఇదంతా నిజంగా నీ లీలనే!" అంటూ ఇంటి దారి పట్టాడు ఆ నాస్థికుడు.
ఇంతకీ ఆ నాస్తికుని పేరు చెప్పలేదు కదు.
అతని పేరు "శివ కేశవ"!
No comments:
Post a Comment