మహాభారతం - శాంతి పర్వం -39(2) - ముఖ్యంగా అయిదు రీతుల పగ పుడుతుంది.
బ్రహ్మదత్తుడు: ఓ పూజనీ! ‘నీవన్నది నిజమే! ఈ విషయంలో నీ దోషమేమీలేదు. కానీ నీవు వెళ్లి పోతే మాత్రం నామనసుకు కష్టంగా వుంటుంది,కనుక ఇక్కడే వుండు’మన్నాడు.
శారిక : రాజా! ఒకరి నొకరం నొప్పించుకొన్నాము. దీని వలన మనసులో చల్లారని పెద్ద పగ ఏర్పడింది. అయినా నీ తియ్యని మాటలకు మోసపోయి మళ్ళీ కలిసి మెలసి వుండడం కుదరద'ని చెప్పింది.
బ్రహ్మదత్తుడు: నాబిడ్డ చేసిన దానికి నీవు ప్రతీకారంగా గుడ్లు పీకేశావు. అంతటితో పగ తీరి పోతుంది. ఎటువంటి నీచులైనా దగ్గరకు చేరిన బుద్దిమంతులను వారు చేసిన మేలును మరచి నింద మోపరు కదా!
శారిక: రాజా! స్నేహం చెడిపోయినా, తియ్యని మాటల మాయలో పడిపోయి ఆ పగను మరచి పోవచ్చు కానీ ... దాని వలన చావు సంభవించవచ్చు. కలత పుట్టవచ్చు. కీడు పొందవచ్చు. అంతేగానీ మంచి మాత్రం జరుగదు.
'వినుము! నేల దోఁచికొనినను దాయాదులైన మాట మాటకేని నాఁడు వారి యెడను గీడు వారక చేసినఁ బగ జనించు నిట్లు భంగులైదు'
ఓ రాజా! ముఖ్యంగా అయిదు రీతుల పగ పుడుతుంది. భూమి దురాక్రమణవలన, దాయాదుల వలన, ఆడవారి వలన, మాటామాటా పెరిగి నందువలన, అడ్డూ ఆపూ లేని చెడు తలపెట్టడం వలన పగ పుడుతుంది. పగ పుట్టిన తరువాత ఒక పట్టాన పోదు. అది చెట్టులో దాగిన నిప్పువలె మనసులో దాగి వుంటుంది. కాబట్టి నమ్మితే మాత్రం ఎప్పుడైనా చెడిపోతాడు. అంతేకాదు కన్న తల్లిదండ్రులను, తోడబుట్టిన వాళ్ళను, కన్న సంతానాన్ని,స్నేహితులను కూడా నమ్మవద్దని నీతి శాస్త్రం చేతున్నది. కనుక మనసు నిండా పగ పూనిన వాళ్ళను ఏవిధంగా నమ్మాలి? ఇక నీ చతురోక్తులు చాలించు.
బ్రహ్మదత్తుడు: శారికా! కాలాన్ని బట్టి జనానికి మంచి చెడులు కలుగుతూ వుంటాయి. వాటిని దాటి ముందుకు పోవడం మన వశమౌతుందా? అంతెందుకు? నిన్ను వదులు కోవడానికి నేనేమైన వెఱ్రి వాడనా?
శారిక: (బ్రహ్మ దత్తుని వైపు తీక్షణంగా చూసి) రాజా నీ చల్లని మాటల మాటున దాగిన కోపం సముద్రంలో దాగిన బడబాగ్ని వంటిది' అని పలికి రాజుపై తనకు గల అపనమ్మకాన్ని బైట పడనీకుండానే పూజని తనకు అనువైన చోటుకు ఎగిరి పోయింది. అందువలన ధర్మజా! ప్రజలెవ్వరినీ రాజు గుడ్డిగా నమ్మరాదు. అప్పుడే తననూ, తన సంపత్తినీ రక్షించు కోగలుగుతాడు. భారద్వాజ వంశసంభవుడు ‘కణికుడు’ సౌవీర రాజు శత్రుంజయుడికి ఉపదేశించిన నీతి వాక్యాలు విను. (ఆది పర్వంలో ఒక కణికుడు దుర్యోధనుడికి దుర్బోధ చేశాడు. అతను వేరు. అతడు శకునికి మంత్రి).
No comments:
Post a Comment