భగవద్గీత
రెండవ అధ్యాయం
నిన్న
ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. అటువంటప్పుడు ఇక విచారం దేనికి? అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు. ఈ విషయాన్నే అక్కడ సంజయుడు దృతరాష్ట్రునికి చెప్తున్నాడు.
ఈరోజు
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ
శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమాపాయినోஉనిత్యాః
తాంస్తితిక్షస్వ భారత 14
తాత్పర్యం: ఓ కౌంతేయా! ఇంద్రియాలకు సంబంధించిన ఎండాకాలం, చలికాలం, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తాయి. అవి వస్తుంటాయి, పోతుంటాయి. అవి తాత్కాలికంగా జరుగుతూ ఉంటాయి. ఓ భారతా! వాటిని సహించ వలసిందే.
వ్యాఖ్యానం: అర్జునుడు కుంతీ పుత్రుడు కాబట్టి కౌంతేయ అని పిలువబడ్డాడు. భరత వంశస్థుడు కాబట్టి భారతా అని పిలవబడ్డాడు.
చలి, ఎండ, సుఖం, దుఃఖం ఇవి తాత్కాలికంగా వస్తుంటాయి, పోతుంటాయి. వీటికి మనం అలవాటు పడాలి. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు విచారించడం బుద్ధిమంతుల లక్షణం కాదు. వీటిని మనం అలవాటుగా చేసుకోవాలి.
యం హి న వ్యథయంత్యేతే
పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం
సోஉమృతత్వాయ కల్పతే 15
తాత్పర్యం: ఓ పురుష శ్రేష్టుడా! అర్జునా! ఎవరైతే చలికి గాని, వేడికి గాని తట్టుకుంటారో, ఎవరైతే సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా చూస్తారో, వారు మోక్షానికి అర్హులు.
వ్యాఖ్యానం: పురుషర్షభ అని శ్రీకృష్ణుడు అర్జునుడిని సంబోధించాడు.అంటే పురుషులలో శ్రేష్ఠుడు అని అర్థం. శీతోష్ణాలను, సుఖదుఃఖాలను ఎవరైతే సమానంగా చూస్తారో వారిని పురుషులలో శ్రేష్ఠుడు గా భావించవచ్చు. అర్జునుడు అలాంటి గుణాలను కలిగి ఉన్నాడని శ్రీకృష్ణుడి భావం కావచ్చు. అప్పుడు అర్జునుడు మోక్షానికి కూడా అర్హత సాధించినట్లే.
మనకు ఆ అర్హత ఉందా అని మీరు బాగా ఆలోచించండి. సుఖం వచ్చినప్పుడు ఎగిరి గంతేస్తాం. కష్టం వచ్చినప్పుడు కుమిలిపోతాం. వ్యాపారం చేసినప్పుడు లాభం వస్తే సంతోషిస్తాం. నష్టం వస్తే ఏడుస్తాం. అలా కాకుండా దానికి కారణాలు తెలుసుకుని, మరలా ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి.
అదే విధంగా విద్యార్థులు పరీక్షల్లో పాసయితే పార్టీ ఇస్తారు. ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. అలా కాకుండా ఎక్కడ ఫెయిలయ్యారో తెలుసుకొని దాన్ని సరిదిద్దుకునే మార్గం చూసుకోవాలి. ఏ విషయంలోనైనా సరే అంతే. ఆత్మహత్య సమస్యకి పరిష్కారం కాదు.
మనలో ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్జునుడే. మనందరికీ ఉపదేశం చేయబోయేది ఆ శ్రీకృష్ణపరమాత్మే.
No comments:
Post a Comment