దురాశ: శ్రీరంగం అనే గ్రామంలో భీమయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను ప్రతిరోజూ అడవికి వెళ్ళి చెట్లు నరికి, వాటివల్ల లభించే కట్టెలను ఆ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి అమ్ముకొని జీవించేవాడు. ఒకరోజు భీమయ్య ఎప్పటిలాగే ఒక పెద్ద చెట్టు ఎంచుకుని దాన్ని నరకడం మొదలు పెట్టాడు.
ఆ చెట్టుకింద పుట్టలో ఒక పాము ఉంది. అది భీమయ్య గొడ్డలి శబ్దానికి బయటకు వచ్చింది. “అయ్యో, ఈ చెట్టు నా నివాసం దీన్ని కూలదోయకు” అని ప్రార్థించింది పాము. “నిజమే! కాని ఇదే నా జీవనాధారం. ఈ చెట్టు కట్టెలు అమ్ముకుని నాలుగు డబ్బులు వస్తే కాని నా కడుపు నిండదు” అని చెప్పాడు భీమయ్య. “ఈ చెట్టును కొట్టి కట్టెలమ్మినంత మాత్రాన నీకు ఈ రోజు గడుస్తుందే కాని నీ పేదరికం తీరదు. ఈ చెట్టును నువ్వు కొట్టకుండా వదిలేస్తే నీకో బహుమతి ఇస్తాను” అంది పాము.
పాము మాటలతో చెట్టును కొట్టే ప్రయత్నం మానుకున్నాడు భీమయ్య. పాము తన పుట్టలోనికి వెళ్ళి ఒక మణిని తెచ్చి భీమయ్యకు ఆ మణి ఇస్తూ "ఇది చాలా విలువైనది. దీనిని అమ్ముకుంటే నీకెంతో డబ్బు వస్తుంది. ఆ డబ్బు అయిపోయాక మళ్ళీ రా! నీకు మణులిస్తాను” అని చెప్పింది.
భీముడు సంతోషిస్తూ ఆ మణి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. పాము చెప్పినట్టే దానిని అమ్ముకుంటే చాలా ధనం వచ్చింది. ఆ ధనంతో అతడు కొంతకాలం సుఖంగా కాలం గడిపాడు. ధనం అయిపోయాక మళ్ళీ పాము దగ్గరకు వెళ్ళి మరొక మణి తెచ్చుకున్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజు అతని మనసులో ఒక దురాలోచన వచ్చింది. వెంటనే పాము దగ్గరకు వెళ్ళి "అస్తమాను నీ దగ్గరకు రావడం విసుగ్గా ఉంది. ఒక బస్తా నిండా రత్నాలు ఇస్తే ఇక ఇక్కడికి రాను” అని అడిగాడు.
పాము భీమయ్య అత్యాశకు ఆశ్చర్యపోతూ.. “మానవుడా! నేను అన్నీ ఒకసారే ఇవ్వలేను. అంత శక్తి నాకు లేదు. ఒక మణి ఇచ్చిన కొన్ని రోజులకు గాని మరొక మణిని ఇవ్వలేను” అని చెప్పింది. పాము సమాధానం విని బీమయ్యకి కోపం వచ్చింది. ఎలాగైనా పామును చంపి, పుట్టని తవ్వి మణులన్నీ ఒక్కసారే తీసుకోవాలనుకున్నాడు.
ఒకరోజు పాముపుట్ట దగ్గరకు కొంత గడ్డి తీసుకొచ్చి, అలికిడి చేయకుండా పాము పుట్టలో ఆ గడ్డిని దూర్చి నిప్పు పెట్టాడు. నిప్పు ఆరిపోయాక పుట్టని తవ్వాడు. అతని పథకం ప్రకారం పాము లోపలే మాడి చచ్చిపోవాలి. కాని మణులు కాదు కదా చచ్చినపాము కూడా అతని కంటికి కనబడలేదు. అవాక్కయ్యాడు భీమయ్య. మణుల జాడ లేదు. పాము జాడ లేదు. భీమయ్య నిరాశతో దుఃఖిస్తూ ఇంటిదారి పట్టాడు.
ఇదంతా దూరంగా ఒక పొదచాటునుండి గమనించింది పాము. 'ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించి నేను ముందు జాగ్రత్తపడడం మంచిదయ్యింది. అమ్మో, ఈ మానవులను నమ్మకూడదు' అనుకుంటూ మరొక నివాస ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్ళిపోయింది పాము.
No comments:
Post a Comment