Monday, February 7, 2022

రథసప్తమి: అంటే ఏమిటి, ఎందుకు?

రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.

1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు,
3. జ్యేష్టం-మిత్రుడు,
4. ఆషాఢం-వరుణుడు,
5. శ్రావణంలో ఇంద్రుడు,
6. భాద్రపదం-వివస్వంతుడు,
7. ఆశ్వయుజం-త్వష్ణ,
8. కార్తీకం-విష్ణువు,
9. మార్గశిరం- అంశుమంతుడు,
10. పుష్యం-భగుడు,
11. మాఘం-పూషుడు,
12. ఫాల్గుణం-పర్జజన్యుడు.

ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.

భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కధనం ప్రకారం

బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట.అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.

దీన్ని లెక్క కడితే 'యుగం 12000 ఏళ్లు, సహస్రం 1000, యోజనం 8 మైళ్లు, మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే 
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.

ఆ ఏడు గుర్రాల పేర్లు 
1. గాయత్రి,
2. త్రిష్ణుప్పు, 
3. అనుష్టుప్పు, 
4. జగతి, 
5. పంక్తి, 
6. బృహతి, 
7. ఉష్ణిక్కు

వీటి రూపాలు సప్త వర్ణాలకు సరి పోలుతాయి.

రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది.

ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.

సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.

ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వ దేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది.జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!

పూజ విదానం:- చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి,ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి.ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి.దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

మనం చేసే పూజలు, వ్రతాలు అన్ని పుణ్యసంపాదన కొరకే. శివ కేశవులకు ఇరువురికి మాఘమాసం ప్రీతికరమైనది.

ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!

No comments:

The Wisdom of the Turtle: Moving Forward with Patience and Purpose

There is something quietly profound about watching a turtle move. Its steps are slow, steady, and deliberate, yet never meaningless. The wor...