సూర్యభగవాన్ విశిష్టత:
సప్తలోక ప్రకాశాయ సప్త సప్త రథాయ చ ।
సప్త ద్వీప ప్రదీపాయ భాస్కరాయ నమో నమ: ॥
సకల చరాచర జగత్తుకు వెలుగును, తేజస్సును ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఈయన భూమి మీద తొలిగా తన వెలుగును ప్రసాదించిన రోజు సప్తమి. అందుకనే మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతిగా, రథ సప్తమిగా లోకప్రసిద్ధి పొందింది.
సూర్యునికి వివస్వంతుడనే పేరు ఉంది. వివస్వంతుని కుమారుడు వైవస్వతుడు. ఇతని మన్వంతరం ప్రారంభమైంది కూడా సప్తమి రోజునే. సూర్యుడు తన రథాన్ని అధిరోహించింది కూడా మాఘ శుద్ధ సప్తమి రోజునే. అందుకనే మాఘ శుద్ధ సప్తమి రథసప్తమిగా ప్రసిద్ధి పొందింది. మత్స్యపురాణంలో ఈ వివరాలు ఉన్నాయి.
మనకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. వీరందరిలో మన చర్మచక్షువులకు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఒకే ఒక దైవం సూర్యభగవానుడు. అందుకనే ఆయన కర్మసాక్షి అయ్యాడు. సకల వేద, పురాణ, ఇతిహాస, కావ్య వాజ్ఞ్మయమంతా సూర్యోపాసన వైశిష్ట్యాన్ని ప్రకటిస్తుంది.
సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్యభగవానుడు. అనంతమైన శక్తితో కూడిన కిరణాలతో లోకాలన్నిటికీ వెలుగును, తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. అన్ని ఐశ్వర్యాలకన్నా పరమోన్నతమైన ఆరోగ్యభాగ్యాన్ని వరప్రసాదంగా భక్తులకు అనుగ్రహించే కరుణామూర్తి. అందుకనే, ఆదిత్యోపాసన సర్వోన్నతమైందిగా, సకల పాపాలను పోగొట్టే తారకమంత్రంగా శాస్త్ర, పురాణ, ఇతిహాస గ్రంథాలు చెబుతున్నాయి.
సూర్యోపాసన చేసి, సూర్యశతకాన్ని రచించిన పుణ్యం చేత మయూరుడనే కవి కుష్ఠువ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. అగస్త్య మహర్షి చేత ఆదిత్యహృదయాన్ని ఉపదేశం పొంది, దాన్ని పారాయణ చేసిన ఫలితంగా శ్రీరామచంద్రమూర్తి రావణాసురిడిని సంహరించాడు. ఇంకా మరెందరో పుణ్యమూర్తులు సూర్యోపాసన చేసి, రథసప్తమీ వ్రతాన్ని ఆచరించిన పుణ్యప్రభావం చేత ఎన్నో బాధల నుంచి విముక్తులైన గాథలు ఉన్నాయి. మొత్తంగా సూర్యోపాసన అనంతమైన ఫలితాలను ఇస్తుంది.
సూర్యగ్రహ గమనాన్ని బట్టే ఋతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. ఈవిధంగా సూర్యగమనంలో మార్పుల వల్ల ఏర్పడ్డ ఉత్తరాయణమే మకర సంక్రమణంగా, సంక్రాంతి పండుగగా లోకంలో వ్యాప్తి చెందింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా సూర్యుడి నుంచి వచ్చే వేడి వల్ల సముద్రాలు, నదుల్లోని నీరు ఆవిరవుతుందని, ఆ ఆవిరి మేఘాలుగా మారి, వర్షించటం వల్ల సకల ప్రాణికోటి తాగటానికి మంచి నీరు, పంటలు పండటానికి తగిన నీరు లభిస్తోందని చెబుతోంది. ఈవిధంగా చూసినా అఖండ భూమండలం మీద సకల ప్రాణులకు జీవనాధారుడు సూర్యుడే అని స్పష్టమవుతోంది.
సౌరార్చన విశేషాలు:
ఆదివారం నాడు తెల్లజిల్లేడు సమిధలు ఉపయోగించి మహాసౌమంత్రంతో హోమం చేసినవారికి అభీష్టసిద్ధి కలుగుతుంది.
ఆదివారం రోజున తెలుపు, ఎరుపు, పసుపుపచ్చని మృత్తికలను ఒంటికి పూసుకుని, మృత్తాకాస్నానం చేసిన వారికి కోరికలు సిద్ధిస్తాయి.
వివిధ రంగుల పూలతో ప్రతి ఆదివారం విడువకుండా ఆదిత్యుని పూజించి, ఆ రోజు ఉపవాసం ఉన్నట్లయితే కోరికలు అతిశీఘ్రంగా నెరవేరుతాయి.
ప్రతి ఆదివారం ఆవునెయ్యితో గాని, నువ్వుల నూనెతో గాని దీపారాధన చేసి, ఆ దీపాన్ని సూర్యస్వరూపంగా భావించి పూజించినట్లయితే నేత్రవ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.
రాగిపాత్రలో నువ్వులనూనెతో దీపారాధన చేసి, ఆ దీపాన్ని బ్రాహ్మణుని దానం చేసినవారికి జ్ఞానప్రాప్తి కలిగి, అంతిమంగా ముక్తి లభిస్తుంది.
చతుష్పథం (నాలుగు రోడ్లు కలిసే కూడలి)లో ప్రయత్నపూర్వకంగా ద్వాదశాదిత్యులను ఉద్దేశించి 12 దీపాలు దానం చేసిన వారు భాగ్యవంతులు అవుతారు. మరుసటి జన్మలో రూపవంతులు, భాగ్యవంతులు అవుతారు.
పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, రక్తచందనం, ఎర్రని పుష్పాలు, అక్షతలు, తిలలు, గరిక ఇగుళ్ళు కలిపిన జలంతో నిత్యం ద్వాదశాదిత్యులకు 12 అర్ఘ్యాలు ఇచ్చి, ఆ ద్రవ్యాలతో ఆదిత్యుని అర్చించి, ఒక సంవత్సరం పాటు అష్టాక్షరీ మహామంత్రాన్ని దీక్షగా జపించిన వారికి సంవత్సరాంతంలో ఇష్టసిద్ధి తప్పకుండా కలుగుతుంది.
సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సూర్యునుకి అభిముఖంగా నిలబడి, సౌరమంత్రం జపించినా, సూర్యస్తోత్రాలు పారాయణ చేసినా జన్మ ప్రారంభం నుంచి అప్పటివరకు చేసిన పాపాలు నశిస్తాయి.
గుగ్గులు కర్ర, మారేడు చెక్క లేదా దేవదారు చెక్కతో నలుపలుకలుగా ఉండే ఆసనం తయారుచేసి, దాని మీద ప్రభాకరుని ఆవాహన చేసి, కర్పూరం, అగరు మొదలైన ద్రవ్యాలతో అర్చించిన వారికి స్వర్గలోక ప్రాప్తి స్థిరంగా కలుగుతుంది.
‘విషువ’ అనే పుణ్యకాలంలో సూర్యార్చన చేసిన వారికి సమస్త పాపాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పులగం, పాయసం, అప్పాలు, పండ్లు, దుంపలు, నెయ్యి తదితర ద్రవ్యాలతో సూర్యబలి ఇచ్చిన వారికి కోరికలన్నీ తీరుతాయి.
మూలమంత్రాన్ని పారాయణ చేస్తూ, ఆవు నేతితో తప్పరణ చేసిన వారికి సర్వసిద్ధులు కలుగుతాయి. ఆవుపాలతో తర్పణ చేస్తే మనస్తాపాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆవుపెరుగుతో తర్పణ చేస్తే కార్యసిద్ధి
కలుగుతుంది.
పవిత్ర తీర్థజలాలతో అరుణ, మహాసౌర మంత్రాలతో సూర్యునికి అభిషేకం చేస్తే పరమపదం లభిస్తుంది.
భక్తిశ్రద్ధలతో ఆదిత్యుడిని ఒక్కరోజు పూజించిన ఫలితం వంద యాగాలు చేసిన ఫలితాన్నిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.
వేదాల్లో సూర్యోపాసన:
కృష్ణయజుర్వేదంలో సూర్యవైభవం ఎన్నో చోట్ల కనిపిస్తుంది. ‘తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదశి సూర్య...’ (కృష్ణ యజుర్వేదం, సంహిత, 1 ` 4)లో అనే మంత్రం చీకటితో నిండి ఉన్న సకల జగత్తు అంతా సూర్యుని కాంతి వల్లనే దృగ్గోచరమవుతుందని చెబుతోంది.
నారాయణోపనిషత్తు ‘ఘృణిస్సూర్య ఆదిత్యోం న ప్రభావాత్యక్షరం మధుక్షరన్తి తద్రసం’ అంటుంది. సముద్రాల్లోని ఉప్పు నీటిని తన కిరణాల ద్వారా గ్రహించి, తన ప్రభావం చేత ఆ ఉప్పు నీటిని తాగటానికి యోగ్యమైన నీరుగా, ఓషధీగుణాలు కలిగినదిగా మార్చి, మేఘాల ద్వారా వర్షింపజేస్తాడు సూర్యభగవానుడు. ఈవిధంగా సూర్యభగవానుడి అనుగ్రహ ఫలితంగా అందిన వాన నీటి ద్వారానే పంటలు పండుతాయి. పంటల వల్ల మానవాళికి అన్న సమృద్ధి కలుగుతుంది. అంటే, సకల మానవాళి మనుగడకు సూర్యుడే జీవాధారం అని వేదం స్పష్టం చేస్తోంది.
నారాయణోపనిషత్తులో ‘ఆదిత్యోవా ఏష ఏతన్మండలం తపతి తత్రతా ఋచ:...’ అని ఉంటుంది. అంటే సూర్యుని ఆవరించి ఉండే తేజస్సు ఋగ్వేద స్వరూపం. ఆయన నుంచి లోకాలకు అందే వెలుగు సామవేదం. సాక్షాత్తు సూర్యభగవానుడే యజుర్వేద స్వరూపం అని అర్థం.
‘సూర్యస్యచక్షూ రజసైత్యావృతం తస్మినార్పిత భువనాని విశ్వా...’ (ఋగ్వేదం, 1`164`14) సూర్యుని పైనే సమస్త ప్రాణికోటి ఆధారపడి ఉంది. సూర్యుడు పరమాత్మ స్వరూపుడు.
శ్రౌత కర్మల్లో నిర్వహించే యజ్ఞయాగాది క్రతువుల్లో సూర్యునికే అగ్రస్థానం. చంద్రుని వెన్నెల కూడా సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిరదే. ఓషధుల్లో ఉండే ఔషధ గుణం సూర్యుని వెలుగు ద్వారా ఏర్పడిరదే. ఇంకా మరెన్నో సూర్యవైభవాలను ప్రకటించే విశేషాలను వేదాలు విస్తారంగా చెబుతున్నాయి.
సూర్యారాధన వల్ల విజ్ఞానం, ఉత్తమ గుణాలు, వర్చస్సు, ఆయుష్షు, ధనం, సంతానభాగ్యం కలుగుతాయి. వాత, పిత్త, క్షయ, కుష్ఠు వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. మొత్తంగా ఆరోగ్య సంపద ఆదిత్యుని ఉపాసన ద్వారా వరంగా లభిస్తుంది.
బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః ।
సాయంధ్యాయేస్సదా విష్ణుం త్రయీమూర్తిర్దివాకరః॥
సూర్యభగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. జీవుల పుట్టుక, పెరుగుదల, క్షయం అన్నీ సూర్యతేజస్సు వల్లే జరుగుతున్నాయి. ఈవిధంగా సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడయ్యాడు.
ఇతిహాస, పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి సూర్యోపాసన ద్వారా వాజసనేయ సంహిత (శుక్ల యజుర్వేదం) పొందాడు. వాయుదేవుని కుమారుడైన ఆంజనేయుడు కూడా సూర్యుని గురువుగా స్వీకరించి, ఆయన నుంచి సకల విద్యలు వరంగా అందుకున్నాడు. కుంతీదేవి సూర్య మంత్రాన్ని ఉపాసించటం ద్వారా సంతానం (కర్ణుడు) పొందింది. సత్రాజిత్తు సూర్యుని ఆరాధించటం వల్లనే శమంతకమణి సాధించాడు. అరణ్యవాస కాలంలో ధర్మరాజు సూర్యోపాసన చేసి, అక్షయ పాత్రను పొంది, తన ఆశ్రమానికి వచ్చిన వేలాది మందికి అన్నదానం చేశాడు.
ప్రస్కణ్వుడనే మహర్షి సూర్యమంత్రాలను ఉపాసన చేయటం ద్వారా తన చర్మరోగం నుంచి విముక్తి పొందాడు. భద్రేశ్వరుడనే రాజు కూడా ఆదిత్యోపాసన ద్వారా శ్వేత కుష్ఠురోగం నుంచి ఉపశమనం పొందాడని పద్మపురాణంలో ఉంది. సూర్యగాయత్రి, అరుణం, మహాసౌరం, ఆదిత్యహృదయం, మయూర శతకం మొదలైన వాటిని పారాయణ చేయటం ద్వారా అనేక శారీరక, మానసిక రుగ్మతల నుంచి విముక్తిపొందిన భక్తుల కథలు ఎన్నో ఉన్నాయి.
ప్రత్యేకించి, రథసప్తమి రోజున చేసే స్నానం, సూర్యారాధన అనేక విశేష ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున జిల్లేడు ఆకులను శిరసు, భుజాల మీద ఉంచుకుని స్నానం చేయాలి. గోధుమనూకతో చేసిన పొంగలిని సూర్యునికి నివేదన చేయాలి. ఇందువల్ల ఏడుజన్మల్లో చేసిన పాపం నశిస్తుందని నారద పురాణం చెబుతోంది.
సూర్యగమనం ఆధారంగానే ఋతువులు, అయనాలు (ఉత్తరాయణం, దక్షిణాయనం) ఏర్పడతాయి. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సందర్భం మకర సంక్రమణం. ఆ తర్వాత మాఘ శుద్ధ సప్తమి నుంచి సూర్యగమనం దక్షిణదిశకు మారుతుంది. ఈవిధంగా, రథసప్తమి ఖగోళ విజ్ఞానానికి సంకేతంగా నిలుస్తుంది.
మాఘ మాసం, శుక్ల పక్షంలో షష్ఠి తిథితో కూడిన సప్తమి వస్తే, అది మరింత పర్వదినం. ఆ రోజు సూర్యునికి ఎంతో ప్రీతికరం. సాధారణ రథసప్తమి పర్వదినాల కన్నా షష్ఠితో కూడిన సప్తమి రోజున చేసే సూర్యారాధన మరింత ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది.
యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు
తన్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పున:
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హర ॥
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నర:
కేశవాదిత్య మాలోక్య క్షణాన్నిష్కల్మషో భవేత్ ॥
రథసప్తమి రోజున ఈ శ్లోకాన్ని పఠిస్తూ, శాస్త్రవిధిగా స్నానం చేయాలని, ఫలితంగా ఏడు జన్మల్లో చేసిన పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం శారీరక రోగాలు ఉన్నవారు సూర్యారాధన చేస్తే, మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రత్యేకించి నేత్రదోషాలు, చర్మవ్యాధుల నుంచి సూర్యోపాసన ద్వారా వేగంగా ఉపశమనం లభిస్తుంది.
మొత్తంగా సూర్యోపాసన సకల వ్యాధులను దూరం చేసేదిగా, సకల పాపాలను పోగొట్టే ఉత్తమ వ్రతంగా లోకవ్యాప్తిలో ఉందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
No comments:
Post a Comment